తిరుపతి వాసు యాదవ్‌పై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గం

తిరుపతి వాసు యాదవ్‌పై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గం
వైసీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్
అనంతపురం ప్రతినిధి ఆగస్టు 21 యువతరం న్యూస్:
ఈ కూటమి ప్రభుత్వానికి బీసీ నాయకులను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం కుట్రపూరితంగా తిరుపతి బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్‌పై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయన్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో బీసీలను భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో బీసీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్‌పై కల్పిత కథలతో కేసులు పెట్టారని, ఒక్క ఆధారమైనా, వీడియో విజువల్స్ ఏమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించారు. తిరుపతి వాసు యాదవ్ ఎలాంటి తప్పు చేయలేదని, కావాలని నిందలు మోపి అతనిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. కొందరు పోలీసులు సైతం కూటమి నేతలకు తొత్తుల్లా మారారని విమర్శించారు. చట్టం అధికార పార్టీకి చుట్టం కాదని, పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. వాసు యాదవ్ తల్లి రేణుకా యాదవ్ చేసిన సవాల్‌ను ఎమ్మెల్యే జేబీ శ్రీనివాస్ స్వీకరించాలన్నారు. శ్రీవారి పాదాల సాక్షిగా ఆ తల్లి ప్రమాణం చేసిందని, ‘నీకు నిజంగా ధైర్యం, నిజాయితీ ఉంటే.. వాసు యాదవ్ నీపై దాడి చేశాడని ఇదే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా.. అంటూ జేబీ శ్రీనివాస్‌కు సవాల్ విసిరారు. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా బీసీ నాయకులపై కక్షపూరిత కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని రమేష్ గౌడ్ పేర్కొన్నారు.



