కష్టపడిన కార్యకర్తకే కాంగ్రెస్లో గుర్తింపు


కష్టపడిన కార్యకర్తకే కాంగ్రెస్లో గుర్తింపు
సీనియర్ల సేవలే పార్టీకి బలం.. యువ నాయకులు వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి మంత్రి సీతక్క
ములుగు ములుగు ప్రతినిధి ఆగస్టు 4 యువతరం న్యూస్ :
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు, బాధ్యతలు తప్పకుండా దక్కుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.పార్టీని కష్టకాలంలో బలోపేతం చేసిన సీనియర్ నాయకుల సేవలు చిరస్మరణీయమని, వారి అనుభవాన్ని యువ నాయకత్వం స్ఫూర్తిగా తీసుకుని ప్రజల మధ్య పనిచేయాలని పిలుపునిచ్చారు,సోమవారం కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించిన మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుల అభినందన సభల్లో పాల్గొన్నారు. కొత్తగూడ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బానోత్ రూప్సింగ్, గంగారం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ముడిగా వీరభద్రకు శుభాకాంక్షలు తెలిపారు, కొత్తగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా 16 సంవత్సరాల పాటు పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్య, గంగారం మండల మాజీ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించి అభినందించారు,మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా సభా వేదిక వద్దకు తీసుకువచ్చి నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు, సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,,కాంగ్రెస్ పార్టీలో పదవులు వారసత్వంగా రావని, ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయని స్పష్టం చేశారు, సీనియర్ నాయకులు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, పార్టీని బలోపేతం చేశారని, వారి అనుభవం కాంగ్రెస్ పార్టీకి గొప్ప ఆస్తి అని కొనియాడారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షులు సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకుంటూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు,ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర రాజకీయాలపై మంత్రి సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల పేరుతో యువతను ఆశపెట్టి నిరాశకు గురిచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు,అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నుంచి గ్రామీణాభివృద్ధి వరకు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు,కొత్తగా బాధ్యతలు చేపట్టిన పార్టీ నాయకులు, సీనియర్ నాయకుల అనుభవాన్ని గౌరవిస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క సూచించారు,రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు,కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, సర్పంచులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



