కాలువ పై అక్రమ నిర్మాణాలు

కాలువలపై అక్రమ నిర్మాణాలు
చోద్యం చూస్తున్న అధికారులు
(యువతరం సెప్టెంబర్ 13) మంగళగిరి ప్రతినిధి:
సామాన్యులు ఎవరైనా ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే ఆగమేఘాలపై కూల్చివేసే అధికారులు ఆ విధమైన చర్యలను కొందరి వరకే పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక పరిధిలో కాలువలపై అక్రమ నిర్మాణాలు నానాటికి పెరిగిపోతున్నాయి.కాలువ లపై శ్లాబు వేసి రేకుల షెడ్లు నిర్మించేస్తూ, నిబంధనలను యదేచ్చగా ఉల్లంఘించేస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏకంగా కాల్వపై శ్లాబు వేసి మూసి వేసి రేకుల షెడ్డును నిర్మించారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సదరు స్థలాన్ని ఐదేళ్ల పాటు అద్దెకు ఇచ్చేందుకు బహిరంగ వేలం నిర్వహించగా ఓ పాటదారుడు హక్కులు పొందినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటుకు ఏకంగా ముందుకు వచ్చి కాలువను ఆక్రమించి మరి షెడ్డు నిర్మించటం విమర్శలకు తావిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం ప్రక్కనే ఈ తరహా నిర్మాణం జరిగినప్పటికీ స్పందన కనిపించడం లేదు.
అధికారుల ఉదాసీనత
నగరంలో బస్టాండ్ ఎదుట బహిరంగంగా కాలువను మూసివేసి ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మించినప్పటికీ సిటీ ప్లానింగ్ అధికారులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావించి నగరంలో పలు ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయన్నది బహిరంగ వాస్తవం. ఈ విషయమై అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్రావు ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. ఆర్టీసీ డిపో మేనేజర్ మంత్రు నాయక్ ను అడగ్గా సదర్ నిర్మాణం కాల్వపై జరగలేదని పేర్కొనటం గమనార్హం.