స్మార్ట్ సిటీ లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలి
మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి టీ.జీ. భరత్ గుప్తా.

అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించను
స్మార్ట్ సిటీ లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలి
రహదారుల గుంతల గుర్తింపుకు ఏఐ సాంకేతికత వినియోగించాలి
తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి టీ.జీ. భరత్ గుప్తా.
కర్నూలు ప్రతినిధి మే 11 యువతరం న్యూస్:
నగరాభివృద్ధికి సంబంధించిన పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ గుప్తా స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై ఆరా తీశారు, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రహదారులపై ఉన్న గుంతలను గుర్తించి వెంటనే పూడ్చేందుకు ఏఐ సాంకేతికత సహాయం తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై స్టడీ నిర్వహించాలని తెలిపారు.
సుంకేసుల జలాశయం నుండి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని, నెలలోపు పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని తీసుకుని సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్ పనులు, ప్లాంట్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. చెత్త సేకరణకు అవసరమైన ఆటోలను త్వరలోనే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాధనం ఆదా చేసేలా సచివాలయాల తరలింపు, అలాగే అవసరమైన మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు పంప్ హౌస్, గణేష్ నగర్ ప్రాంతాల్లో భూమి కేటాయించాలని సూచించారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని, తొలి దశలో ఆరు పార్కులను అభివృద్ధి చేయాలని తెలిపారు. నగరంలో పూడికతీత పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. టిడ్కో గృహాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఆర్వోలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వి. వెంకటరమణ, అకౌంట్స్ ఆఫీసర్ రఘునందన్, పబ్లిక్ హెల్త్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



