మతిస్థిమితంతో బాధపడుతున్న తల్లి నుంచి చిన్నారికి ప్రాణ రక్షణ కల్పించమంటే నిర్లక్ష్యంగా వదిలేశారు
ఐసిడిఎస్ సిడిపిఓ నిర్లక్ష్యంపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు

మతిస్థిమితంతో బాధపడుతోన్న తల్లి నుంచి చిన్నారికి ప్రాణ రక్షణ కల్పించమంటే… నిర్లక్ష్యంగా వదిలేశారు
చిన్నారితో సహా అదృశ్యమైన తల్లి
ఐసీడీఎస్ సీడీపీఓ నిర్లక్ష్యంపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు
(యువతరం సెప్టెంబర్ 12) మంగళగిరి ప్రతినిధి:
మతిస్థిమితంతో బాధపడుతోన్న తల్లి నుంచి ఏడాది వయస్సు కలిగిన ఓ చిన్నారికి ఎలాగైనా ప్రాణ రక్షణ కల్పించాలని కోరగా…. ప్రాణ రక్షణ కల్పించకపోగా నిర్లక్ష్యంగా వదిలివేసి తమ బాధ్యతా రాహిత్యాన్ని చాటుకున్నారు మంగళగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి. వివరాల్లోకి వెళితే… తిరుపతికి చెందిన బోయ నాని -లక్ష్మి లు భార్యాభర్తలు. వీరికి ఏడాది వయస్సు కలిగిన కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. అంతకు మించి ఇరువురికీ నా అన్న వారు ఎవరూ లేరు. ఈ నేపధ్యంలో బ్రతుకుదెరువు వెతుక్కుంటూ గత ఆరు నెలల క్రితం నాని -లక్ష్మి దంపతులు ఏడాది వయస్సు కలిగిన కుమారుడిని తీసుకుని మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంకు వచ్చారు. అయితే అంతకు ముందే మూడవ నెల గర్భవతిగా ఉన్న సమయంలోనే లక్ష్మి మతి స్థిమితంతో బాధపడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. బిడ్డ జన్మించిన అనంతరం అది మరీ ఎక్కువైంది. ఆమె పిచ్చి చేష్టలతో స్థానికులు సైతం పలు మార్లు నిర్ఘాంతపోయిన సందర్భాలు లేకపోలేదు. అయినా భర్త నాని తన భార్య లక్ష్మీని ప్రేమగానే చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి లక్ష్మి తన ఏడాది బాబు యశ్వంత్ ను ఎత్తుకుని ఎటో వెళ్లిపోయింది. గమనించిన భర్త నాని స్థానికుల సహాయంతో వెతికి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. సోమవారం ఉదయం 10గంటల సమయంలో మళ్లీ లక్ష్మి తన బిడ్డను చంకన వేసుకుని బిడ్డను రైలు క్రింద త్రోసి తాను కూడా రైలు క్రిందపడి చచ్చిపోతానని భర్త నాని ని బెదిరించింది. దీంతో చేసేది లేక స్థానికుల సహాయంతో తన భార్య లక్ష్మిని, కుమారుడు యశ్వంత్ ను నగరంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి తరలించారు.
భార్యా – భర్తల వివాదం మధ్య మీరెందుకు తలదూర్చుతున్నారు?
మతి స్థిమితంతో బాధపడుతోన్న తల్లి భారి నుంచి ఏడాది వయస్సు కలిగిన బిడ్డను ఎలాగైనా సంరక్షించాలని…అందుకే ఆమె భర్తకు మానవత్వం కలిగిన సాటి మనిషిగా అండగా ఉన్నానని…. ఆ తల్లి గురించి స్థానిక ప్రజలను విచారించినా మీకు విషయం ఏమిటో అర్థం అవుతుందని ఆంధ్రప్రభ విలేకరి ఎంత చెప్పినా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఏడాది వయస్సు కలిగిన బాబు తల్లి సంరక్షణలో మాత్రమే ఉండాలని సమాధానం ఇచ్చింది. తల్లి మానసిక సమస్యతో బాధపడుతూ తరచూ తాను బిడ్డతో సహా ఆత్మహత్య చేసుంటానని భర్తను బెదిరిస్తుందని చెప్పినా ఐసీడీఎస్ అధికారిణి సమస్యను అర్థం చేసుకోక పోగా బిడ్డ తల్లి వద్దనే ఉంటాడని…మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిచ్చి తల్లితో వేలిముద్ర వేయించుకుని బిడ్డతో సహా తల్లిని వదిలేశారు
మానసిక సమస్యతో బాధపడుతున్న తన భార్య లక్ష్మి చెర నుంచి ఏడాది వయస్సు కలిగిన చిన్నారి యశ్వంత్ ను రక్షించి తనకు అప్పగిస్తే సంరక్షించుకుంటానని, ఒకవేళ వీలుకుదరకపోతే తల్లి, బిడ్డలను శిశు సంరక్షణా కేంద్రానికి తరలించాలని భర్త నాని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణిని ఎంత బ్రతిమిలాడినా ఫలితం లేకుండా పోయింది. తల్లి బిడ్డలను సంరక్షించే చర్యలు తీసుకోవకపోగా…. మానసిక సమస్యతో బాధపడుతున్న తన భార్య చేత వేలిముద్రలు వేయించుకుని బిడ్డతో సహా పంపడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎంత వెతికినా తన భార్య లక్ష్మి, కుమారుడు యశ్వంత్ కనిపించలేదని, విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి తన భార్య, ఏడాది కుమారుడు అదృశ్యానికి కారణమైన ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సిడిపిఓ వివరణ కోరగా గుంటూరు లోని మహిళ శిశు సంరక్షణ కేంద్రానికి తల్లి లక్ష్మి,చిన్నారి యశ్వంత్ లను తరలించినట్లు తెలిపారు.