గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సామర్థ్యం 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ


గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సామర్థ్యం 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.
కర్నూలు ప్రతినిధి నవంబర్ 19 యువతరం న్యూస్:
గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సామర్థ్యం 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. గురువారం ఓర్వకల్లు మండలం పిన్నాపురం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంచే ప్రతిపాదనపై ప్రాజెక్టు సైట్ వద్ద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిగువ జలాశయానికి బండ్ నిర్మాణం చేపట్టడంతో పాటు టర్బైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రాజెక్టు మొత్తం సామర్థ్యాన్ని 1,680 మెగావాట్లకు పెంచనున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనాలో భాగంగా గాలి నాణ్యత, ఉపరితల జలాలు, భూగర్భ జలాల నాణ్యతపై అధ్యయనం నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల పరిధిలోని 10 గ్రామాల్లో పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులను కూడా కలెక్టర్ వివరించారు. ఇందులో భాగంగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు, వైద్య శిబిరాల నిర్వహణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నిబంధనలు–2006 ప్రకారం ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని, ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను తెలుసుకున్న అనంతరం వాటిని సంబంధిత పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను సంక్షిప్తంగా, స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలియజేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గ్రీన్కో ప్రాజెక్టుతో గ్రామాల అభివృద్ధికి బాటలు – స్థానికులకు ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన.
ప్రాజెక్టు ద్వారా భూముల విలువ పెరుగుదల, తాగునీటి సౌకర్యం, రహదారుల నిర్మాణం, విద్యా, వైద్య సదుపాయాలకు సహకారం
ప్రాజెక్టుకు మద్దతు తెలిపిన బ్రాహ్మణపల్లి, గుమ్మితంతండా, కాలువ గ్రామాల ప్రజలు
గ్రన్కో ప్రాజెక్టు ఏర్పాటు కావడం వల్ల పరిసర గ్రామాల్లో భూముల విలువ పెరగడంతో పాటు స్థానిక రైతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని బ్రాహ్మణపల్లి, గుమ్మితంతండా, కాలువ గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ప్రాజెక్టు కొనసాగాలని, మరింత విజయవంతంగా అభివృద్ధి చెందాలని ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రాజెక్ట్ మరింత విజయవంతంగా కొనసాగి పరిసర గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ప్రజల అభిప్రాయాలు, అవసరాలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం: గ్రీన్కో ప్రతినిధులు
ఓర్వకల్లు మండలం పిన్నాపురం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంచే ప్రతిపాదనపై ప్రాజెక్టు సైట్ వద్ద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, అభివృద్ధి అవసరాలను కలెక్టర్ తో చర్చించి, సంస్థ పరిధిలో సాధ్యమయ్యే కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అమలు చేసేందుకు కృషి చేస్తామని గ్రీన్కో ప్రతినిధులు హామీ ఇచ్చారు. గుమ్మితంతండా గ్రామాన్ని తమ సొంత గ్రామంగా భావిస్తున్నామని, ప్రాజెక్టు ప్రారంభం నుంచి గ్రామ ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను కలెక్టర్‌తో చర్చించి, సాధ్యమైన మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని గ్రీన్ కో ప్రతినిధులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్ రెడ్డి, గ్రీన్కో సంస్థ ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



