AGRICULTUREANDHRA PRADESHSTATE NEWS

కర్నూలు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర కరువు అంచనా బృందం

కర్నూలు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర కరువు అంచనా బృందం

తుగ్గలి మండలం యర్రగుడి గ్రామంలో పంటలు, సాగునీటి వనరుల పరిశీలన.. రైతులతో ముఖాముఖి

కర్నూలు ప్రతినిధి నవంబర్ 02 యువతరం న్యూస్:

ఖరీఫ్‌–2026 సీజన్‌లో జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు మంత్రిత్వ శాఖల కేంద్ర కరువు అంచనా బృందం (IMCT) సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించింది. ఇందులో భాగంగా తుగ్గలి మండలం చెరువు తాండ, యర్రగుడి గ్రామాల్లో పర్యటించి సాగునీటి వనరులు, పంటల పరిస్థితులను పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించింది.

కేంద్ర కరువు అంచనా బృందానికి భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె. పొన్నుసామి టీమ్ లీడర్‌గా వ్యవహరించగా, WCDM డైరెక్టర్, రాష్ట్ర నోడల్ అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఐఏఎస్ బృందంతో కలిసి పర్యటించారు. బృంద సభ్యులుగా నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధ బటానా, RIC, NPMU-PHEకు చెందిన ధీరేంద్ర కుమార్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ లైవ్‌స్టాక్ ఆఫీసర్ డాక్టర్ సాక్షి భదౌరియా పాల్గొన్నారు.

ముందుగా చెరువు తాండా గ్రామంలోని చెరువును కేంద్ర బృందం సందర్శించి నీటి లభ్యత, సాగునీటి వినియోగం తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం యర్రగుడి గ్రామంలో రైతు హనుమంతుకు చెందిన పొలాన్ని సందర్శించి పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి, గ్రామంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించింది. వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, దిగుబడులపై ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఆర్డీవో ఓబులేసు, ఉద్యానవన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, జలవనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!