ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSSTATE NEWS

జగన్నాథ గట్టులో మైనింగ్ అధికారుల దాడులు..

మూడు హిటాచీలు, ఒక టిప్పర్, ఒక ట్యాంకర్ సీజ్

అక్రమ గ్రావెల్ తవ్వకాలపై హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి పోరాటం ఫలితం

జగన్నాథ గట్టులో మైనింగ్ అధికారుల దాడులు..

మూడు హిటాచీలు, ఒక టిప్పర్, ఒక ట్యాంకర్ సీజ్

తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.

కర్నూలు ప్రతినిధి నవంబర్ 14 యువతరం న్యూస్:

కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలోని జగన్నాథ గట్టు సమీపంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు ప్రతాప్ తెలిపారు. వ్యవసాయ భూమిని చదును చేసుకునే పేరుతో కొండ ప్రాంతంలో భారీ యంత్రాలను ఉపయోగిస్తూ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారనే విషయాన్ని గుర్తించిన తమ సమితి, అక్టోబర్ 30వ తేదీన కర్నూలు రూరల్ పోలీస్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులో మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుంచి అవసరమైన అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయనే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
తమ ఫిర్యాదు నేపథ్యంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించి మూడు హిటాచీలు, ఒక టిప్పర్, ఒక ట్యాంకర్‌ను సీజ్ చేయడంతో పాటు ఈ వ్యవహారంపై కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
రెవెన్యూ సిఫార్సు లేఖే మైనింగ్ అనుమతి అవుతుందా? ఈ వ్యవహారంలో భూ యజమానులు వ్యవసాయ భూమిని చదును చేసుకునేందుకు అనుమతి కోరుతూ రెవెన్యూ అధికారులను ఆశ్రయించినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని ప్రతాప్ తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు రూరల్ తహసీల్దార్ 25-08-2026న ఆర్సి .బి .255/2026 ద్వారా జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారికి లేఖ రాశారని, గ్రావెల్ రవాణా అనుమతిని సంబంధిత నిబంధనలు, రాయల్టీ చెల్లింపులకు లోబడి పరిశీలించాలని అందులో పేర్కొన్నారని తెలిపారు.
అయితే రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగా మాత్రమే గ్రావెల్ తవ్వకాలు, రవాణా చేపట్టడానికి వీలుంటుందా? మైనింగ్ శాఖ నుంచి వాస్తవంగా అనుమతులు మంజూరయ్యాయా? అనుమతులు మంజూరైతే ఎంత పరిమాణంలో గ్రావెల్ తవ్వడానికి అనుమతి ఇచ్చారు? నిర్ణీత పరిమితులకు లోబడే తవ్వకాలు జరిగాయా? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించారా? రవాణాకు అవసరమైన ఈ-ట్రాన్సిట్ పాసులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ భూమి చదును పేరుతో సహజ వనరుల దుర్వినియోగం జరగకూడదు వ్యవసాయ భూమిని చదును చేసుకోవడానికి చట్టబద్ధమైన అనుమతులు తీసుకుంటే తమ సమితికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ పేరుతో భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు జరిపి తరలించడం జరిగితే దానిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని మల్లెపోగు ప్రతాప్ స్పష్టం చేశారు. భూమి చదును పేరుతో ఎంత మేరకు గ్రావెల్ తవ్వారు? ఎంత పరిమాణంలో బయటకు తరలించారు? తవ్వకాలకు అనుమతించిన భూమి పరిధి ఎంత? వాస్తవంగా తవ్వకాలు జరిగిన విస్తీర్ణం ఎంత? అనే అంశాలను మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాహనాల సీజ్‌తోనే విచారణ ఆగిపోకూడదు.
అధికారులు మూడు హిటాచీలు, ఒక టిప్పర్, ఒక ట్యాంకర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేయడం ఈ వ్యవహారంలో కీలక పరిణామమని సమితి పేర్కొంది. అయితే కేవలం వాహనాలను సీజ్ చేయడంతోనే విచారణ ముగియకూడదని, అక్రమ తవ్వకాల వెనుక ఉన్న పూర్తి వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరింది.
అనుమతులు ఇచ్చిన విధానం, తవ్వకాల పరిమాణం, గ్రావెల్ తరలింపు, రాయల్టీ చెల్లింపులు, రవాణా పత్రాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలు, సహజ వనరుల పరిరక్షణ కోసం హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి నిరంతరం పనిచేస్తుందని, ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మల్లెపోగు ప్రతాప్ స్పష్టం చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!