ANDHRA PRADESHOFFICIAL

రీ సర్వే పనులు పకడ్బందీగా చేపట్టండి

రీ సర్వే పనులు పకడ్బందీగా చేపట్టండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల కలెక్టరేట్ ఫిబ్రవరి 22 యువతరం న్యూస్:

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వే పనుల ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మండల, గ్రామస్థాయి సర్వేయర్లు, వీఆర్వోలను ఆదేశించారు. శుక్రవారం ఉయ్యాలవాడ మండలం ఎస్ కొత్తపల్లి, అల్లూరు గ్రామాలలో జరుగుతున్న రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ గ్రామ సరిహద్దులు, బ్లాక్ సరిహద్దులు రీఫిక్స్ అనంతరం వారం రోజులు ముందస్తుగా రైతులకు నోటీసులు జారీ చేసిన తర్వాతే రీ సర్వే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఎస్ కొత్తపల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో నిర్వహిస్తున్న సర్వే పనుల వివరాలు అడిగి తెలుసుకుంటూ భూముల రికార్డులను, భూ కొలతలను పరిశీలించారు. పొలంలో ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ కొలతల ప్రకారం సర్వే చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం 975.45 ఎకరాల విస్తీర్ణానికి గాను 657.64 ఎకరాల సర్వేను ఇప్పటివరకు పూర్తి చేశామని మిగిలిన 315.76 ఎకరాల విస్తీర్ణాన్ని సర్వే చేయాల్సి ఉందని ల్యాండ్ అండ్ సర్వే ఏడి జయరాజు కలెక్టర్ కు నివేదించారు. ఒక్కో గ్రామానికి 7 బ్లాక్‌లుగా విభజించి రోజుకు 20 నుంచి 25 ఎకరాలు సర్వే చేసేలా ప్రణాళిక చేశామన్నారు. మండల సర్వేయర్‌తో పాటు గ్రామ సర్వేయర్లతో రెండు టీమ్‌లుగా ఏర్పాటు చేసి రైతుల సమక్షంలో రోవర్‌తో భూ రీసర్వే చేస్తున్నామని సర్వే ఎడి కలెక్టర్ కు వివరించారు.

పెండింగ్ లో ఉన్న 315.76 ఎకరాల విస్తీర్ణ రీ సర్వే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రీసర్వే అనంతరం రైతుల భూములుకు హద్దులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే వల్ల పొలాల హద్దులను సరిచూసుకోవడమే కాక రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!