పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన


పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన
రేపల్లె ఏప్రిల్ 24 యువతరం న్యూస్:
సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కీలక చర్చలు నిర్వహించినట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆన్లైన్లో సమాచారమిచ్చారు. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్ బిఎఫ్) ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, నెట్‌వర్కింగ్ కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సింగపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపి, పెట్టుబడుల అవకాశాలపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. ఎస్ బిఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమంత టెయో, గ్లోబల్ కమర్షియల్ లీడర్‌షిప్ & బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రతినిధి అమర్‌ప్రీత్ సింగ్‌లతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలు, అలాగే “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానం గురించి సింగపూర్ ప్రతినిధులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, తీర ప్రాంతంలో పోర్టులు మరియు లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఐటీ & ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉన్న విస్తృత పెట్టుబడి అవకాశాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామిగా మారుతుందన్న నమ్మకాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యక్తం చేశారు.



