
దెందులూరు అభ్యర్థిని మారిస్తేనే వైకాపాలో పనిచేస్తా: నరసింహమూర్తి
(యువతరం ఆగస్టు 23)దెందులూరు ప్రతినిధి:
ఏలూరు జిల్లా దెందులూరు వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియంతృత్వ పోకడల కారణంగా పార్టీలో సీనియర్ నాయకులు ఉండలేని పరిస్థితి నెలకొందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి ఆరోపించారు..
ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులను కాదని, కేవలం తన కోటరీకి చెందిన వ్యక్తులనే అందలమెక్కిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే స్థానికంగా ఉండాల్సింది పోయి.. విదేశాల్లో ఉంటూ ఇక్కడ పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో అబ్బయ్యచౌదరి 17వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, ఈసారి 20వేల ఓట్ల తేడాతో ఓడిపోనున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కోడి పందేలు, జూద శిబిరాలు, మట్టి, ఇసుక మాఫియాలను ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అవినీతిపై పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే తప్ప ఆ పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని నరసింహ మూర్తి స్పష్టం చేశారు..