గ్రామపంచాయతీ మరియు స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలపై 4 న నచ్చలు కలెక్టరేట్

గ్రామపంచాయతీ మరియు స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలపై ఈనెల 4న చలో కలెక్టరేట్
( యువతరం ) డోన్ ప్రతినిధి;
గ్రామ పంచాయతీలలో ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 4న జరుగుతున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం,మండల కార్యదర్శి పి.రామాంజనేయులు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని చిన్న మల్కాపురం గ్రామ పంచాయతీ కార్యాలయ డిజిటల్ అసిస్టెంట్ సాయి చరణ్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు,కాలువలు,శుబ్రపరుస్తూ వీధి దీపాలు వేస్తూ,నీటి సరఫరాతో పాటు కుక్కలు, పందులు,ఇతర జీవాలు ఏవి చనిపోయినా వాటిని తొలగిస్తూ,ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి గ్రామాల పరిశుభ్రతకు గ్రామపంచాయతీ కార్మికులు పాటుపడుతున్నారని, ప్రభుత్వం గానీ,పాలకులు గానీ వారిని మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా నెలల తరబడి వేతనాలు బకాయిలు ఉన్నాయని,ఉద్యోగ భద్రత లేదని,ఆరోగ్యానికి రక్షణ లేదని,ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్లపాలు అవుతాయని,మరోవైపు పాలకుల రాజకీయ వేధింపులు,అక్రమ తొలగింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని,11వ పిఆర్సి లో కనీస బేసిక్ వేతనం రూ.20వేలు తగ్గకుండా చెల్లించాలని,స్వచ్ఛభారత్ కార్మికులను పంచాయతీ కార్మికులుగా గుర్తించి జీవో నెంబర్ 680 అమలుపరిచి రూ. 10 వేలకు తగ్గకుండా వేతనాలు ఇవ్వాలని, బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని,పంచాయతీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్,ఈఎస్ఐ అమలు చేయాలని,పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న పోస్ట్ ల శాంక్షన్ లలో కార్మికుల పేర్లు కనబరిచి తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని,రాజకీయ వేధింపులు,అక్రమ తొలగింపులు ఆపాలని చలో కలెక్టరేట్ తోనైనా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనియెడల పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఖాసింవళి,సి.మద్దయ్య,
ఆర్.చిన్నమ్మ పాల్గొన్నారు.