ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

ఎమ్మెల్యే
గుమ్మనూరు జయరాం

రూ.1.90 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డుకు ప్రారంభోత్సవం

పని చేసిన వారికే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం

అప్పాజిపేట, నెమళ్లపల్లిలో రోడ్లు పూర్తిచేసిన తర్వాతే ఓట్లు అడుగుతా

వంకరాజుకాలువలో తాగునీటి సమస్యకు వారంలో శాశ్వత పరిష్కారం చూపాలి

పామిడి జూన్ 17 యువతరం న్యూస్:

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్ నమోదు చేసుకుని పంట బీమా సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాల కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు.
ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ, కంది పంటలను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న విత్తన కాయలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

పని చేసిన వారికే పట్టం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల్లో మమేకమై పనిచేసే నాయకులకే పార్టీ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములయ్యే నాయకత్వానికే ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఆర్‌ఏ ప్రక్రియపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను సరిదిద్దాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నాయకులు ఐక్యంగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రోడ్లు వేస్తేనే ఓటు అడుగుతా

మండలంలోని అప్పాజిపేట, నెమళ్లపల్లి గ్రామాల్లో వైసీపీ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రహదారి పనులను పూర్తిచేసిన తర్వాతే ఆ గ్రామాల్లో ఓట్లు అడుగుతానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రకటించారు. కొత్త రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

తాగునీటి సమస్యపై అధికారులకు హెచ్చరిక

వంకరాజుకాలువ ఎస్సీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలోగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
అలాగే పెన్నానది పరివాహక ప్రాంతంలోని వంకరాజుకాలువ పొలిమేరల్లో అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలని గ్రామస్తులు కోరడంతో, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, చిన్నారులతో ముచ్చటించి వారి కోసం చాక్లెట్లు కొనుగోలు చేయాలని నగదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వర్, ఏడీఏ వెంకటరాముడు, ఎంపీడీఓ తేజోత్స్న, ఏఓ విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ అశ్వర్థనాయుడు, ఆర్‌ఏ గాయత్రి, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!