మహిళలను కించపరచడం వైసీపీ నీచ సంస్కృతికి నిదర్శనం
బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత

మహిళలను కించపరచడం వైసీపీ నీచ సంస్కృతికి నిదర్శనం
బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత
బుక్కరాయసముద్రం జూన్ 16 యువతరం న్యూస్:
బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత మాట్లాడుతూ రాజకీయాల్లో విభేదాలు సహజం. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ప్రతి ప్రతిపక్షానికి ఉంది. అయితే విమర్శల పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని, రూపాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరచడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వంగలపూడి అనిత పనితీరుపై మాట్లాడకుండా, ఆమె వ్యక్తిగత రూపాన్ని మరియు మేకప్‌ను లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం, మహిళా సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయి.
ఇలాంటి వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి అనిత నే కాదు, ఆత్మవిశ్వాసంతో, హుందాగా జీవించే ప్రతి మహిళను కించపరచడమే. మహిళలు ఎలా దుస్తులు ధరించాలి, ఎలా కనిపించాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. దానిని రాజకీయ విమర్శలకు ఆయుధంగా మార్చడం మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే.
మహిళా గౌరవం గురించి గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకత్వం, తమ పార్టీ నేతల ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తుందా? లేక మౌనంగా సమర్థిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
హోంమంత్రి విధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో విమర్శించాలి. కానీ రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత రూపాన్ని లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ సంస్కృతికి నిదర్శనం.
“దళిత మహిళ ఆత్మవిశ్వాసంతో, హుందాగా, అందంగా కనిపిస్తే వైసీపీ నేతలకు ఎందుకు అసహనం? ఇదేనా మీరు చెప్పే సామాజిక న్యాయం?” అని ఎంపీపీ దాసరి సునీత ప్రశ్నించారు.
వైసీపీకి మహిళలను అవమానించే చరిత్ర కొత్తది కాదన్నారు. గతంలో మహిళా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు జరిగిన సందర్భాల్లో కూడా వైసీపీ నాయకత్వం స్పందించలేదని గుర్తు చేశారు.
అదే సమయంలో కూటమి ప్రభుత్వం మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ పడదని స్పష్టం చేశారు. మహిళలపై వేధింపులు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు సమానమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సందేశం ఇచ్చారని తెలిపారు.
మహిళలపై ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో సొంత పార్టీ నేతలపై కూడా చర్యలు తీసుకున్నామని, సోషల్ మీడియాలో మహిళలను అవమానించే వారిపై కఠిన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం “శక్తి యాప్”, ప్రత్యేక సైబర్ నిఘా, మహిళా పోలీస్ విభాగాల బలోపేతం వంటి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మహిళలను గౌరవించని రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌లో స్థానం లేదన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించే భాషను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ సహించరని ఎంపీపీ దాసరి సునీత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శైలజ, డీలర్ ఆకుల రాజేశ్వరి, చాముండమ్మ, జన చైతన్య కాలనీ మహిళలో పాల్గొన్నారు.



