గ్రీవెన్స్ వ్యవస్థపై అసంతృప్తి – అధికారులకు షోకాజ్ నోటీసులు

ప్రజా సమస్యల పరిష్కారంపై విశ్వాసం పెంపొందించాలి
13 మండలాల్లో ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడం.. గ్రీవెన్స్ వ్యవస్థపై అసంతృప్తి – అధికారులకు షోకాజ్ నోటీసులు
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ముందు కే పి ఐ లు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి
జిల్లా ర్యాంకింగ్ ను మెరుగుపరచండి
ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో ఆర్డీఓల ప్రత్యక్ష భాగస్వామ్యం
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి మే 05 యువతరం న్యూస్:
ప్రజా సంతృప్తి పెంపు, సేవల మెరుగుదల, సమయానుకూల పరిష్కారం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పునరుద్ఘాటించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ నమ్మకాన్ని ప్రతి అధికారి ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత ఉందన్నారు. గత వారం 13 మండలాల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డీఆర్ఓ ను ఆదేశించారు. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే కలెక్టర్ల సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని శాఖల అధికారులు తమకు సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను తక్షణమే పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ పారామీటర్ల ఆధారంగానే జిల్లాకు ర్యాంకింగ్ నిర్ణయించబడుతుందని తెలిపారు.
గ్రీవెన్స్ వ్యవస్థ బలోపేతానికి కొత్త విధానం
జిల్లా కేంద్రంలో రోజుకు 300-400 వరకు గ్రీవెన్స్ దరఖాస్తులు వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ప్రజలు కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆర్డీఓలు నేరుగా పాల్గొని తమ డివిజన్‌కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ అనంతరం వారితో సమీక్ష నిర్వహించి పరిష్కారాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలు స్థానిక స్థాయిలోనే న్యాయం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఒక్క గ్రీవెన్స్ నమోదు కాని మండలాల అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ చేయాలని, సంబంధిత అధికారులు ఈ నెల 11 వ తేదీ కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాను రాష్ట్రంలో మొదటి 10 స్థానాల్లో నిలపాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, ఏ విభాగం 14వ ర్యాంక్ కంటే దిగువన ఉంటే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం కొన్ని విభాగాల్లో జిల్లాకు తక్కువ ర్యాంకులు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆన్లైన్ సేవలు – పెండింగ్ పనులపై దృష్టి
వివిధ శాఖలకు సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీలు సమయానికి చేయకపోవడం వల్లే ర్యాంకులు పడిపోతున్నాయని పేర్కొన్నారు. లేబర్, ఫిషరీస్, ఇండస్ట్రీస్ వంటి శాఖల పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశాలకు సమర్పించే నివేదికలు సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండాలని, పథకం లక్ష్యాలు మరియు సాధించిన ఫలితాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ నివేదికలను సమయానికి సమర్పించాలని ఆదేశించారు.
బెస్ట్ ప్రాక్టీసెస్ – వినూత్నతకు ప్రాధాన్యం
జిల్లాలో వినూత్న పద్ధతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలాల పునరుద్ధరణ, డానిష్ ఫైబర్ రోడ్ల నిర్మాణం, తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో నైలాన్ స్ట్రిప్స్ వినియోగం వంటి ఉత్తమ పద్ధతులను ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని సూచించారు.
ఎన్టీఆర్ హౌసింగ్‌కు సంబంధించిన నిధులు, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, ఆన్లైన్ డేటా ఎంట్రీలు వంటి పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ఏ విభాగంలోనూ జిల్లా పేరు తక్కువ పనితీరుతో ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.



