ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSOFFICIALSTATE NEWS

రూ.1.50 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఎస్ఐ సాయిరామ్‌కు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అభినందనలు

రూ.1.50 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఎస్ఐ సాయిరామ్‌కు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అభినందనలు

చింతపల్లి ఫిబ్రవరి 10 యువతరం న్యూస్:

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వెల్లడించారు.
మంగళవారం అన్నవరం సీఐ వి.వినోద్ బాబు, అన్నవరం ఎస్ఐ కే.సాయిరామ్, చింతపల్లి ఎస్ఐ–2 వెంకటరమణలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, అన్నవరం ఎస్ఐ సాయిరామ్‌కు అందిన ఖచ్చితమైన సమాచారంతో కోటగున్నల గ్రామ పరిసరాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారన్నారు.
ఈ దాడుల్లో సుమారు 308 కిలోల గంజాయి, ఇద్దరు నిందితులు, రవాణాకు ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1.50 కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు.
తన మొదటి పోస్టింగ్‌లోనే ఇంతటి భారీ ఆపరేషన్‌ను చాకచక్యంగా నిర్వహించిన అన్నవరం ఎస్ఐ సాయిరామ్‌ను ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ప్రత్యేకంగా అభినందించారు.
డివిజన్ పరిధిలో గంజాయి రవాణా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏఎస్పీ తెలిపారు. ముఖ్యమైన కూడళ్లు, అక్రమ రవాణాకు ఆస్కారం ఉన్న ప్రధాన మార్గాల్లో నిఘా పెంచామని, ప్రత్యేక బృందాలతో నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు.
జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా గంజాయి సాగు జరగడం లేదని, పొరుగు రాష్ట్రం ఒడిశాలోని దగుడుపల్లి ప్రాంతం నుంచి అక్రమ మార్గాల్లో గంజాయిని అన్నవరం పంచాయతీ కోటగున్నల గ్రామానికి తరలించి నిల్వ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, నర్సీపట్నంకు చెందిన ప్రధాన సూత్రధారి సహా పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించారు. గంజాయి రవాణాకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!