ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS

రోడ్లపై ‘ఆటో’ వికృత చేష్టలు

ముగ్గురు 'వేగ' గాళ్ల ఆట కట్టించిన పోలీసులు!

రోడ్లపై ‘ఆటో’ వికృత చేష్టలు

ముగ్గురు యువకులు అరెస్ట్

ముగ్గురు ‘వేగ’ గాళ్ల ఆట కట్టించిన పోలీసులు!

కర్నూల్ ప్రతినిధి ఫిబ్రవరి 4 యువతరం న్యూస్:

రహదారిపై వాహనం నడపడం అంటే బాధ్యత.. కానీ కొందరు ఆకతాయిలకు అది ఒక ఆటైపోయింది. తమ ప్రాణాలకే కాదు, పక్కన వెళ్లే సామాన్యుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తూ ఆటోలతో విన్యాసాలు చేసిన ముగ్గురు యువకులకు కర్నూలు పోలీసులు చుక్కలు చూపించారు. సోషల్ మీడియాలో ‘లైక్స్’ కోసం రోడ్లపై నరకం చూపించిన ఆ కిలాడీ డ్రైవర్లను కటకటాల్లోకి నెట్టారు.
ఏం జరిగిందంటే?
ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం జాతీయ రహదారి-44పై పంచలింగాల వద్ద ముగ్గురు యువకులు ముక్కుపచ్చలారని రీతిలో ఆటోలతో హల్‌చల్ చేశారు. ఆటోను ఒక చక్రంపై లేపుతూ (వీలింగ్), అతి వేగంతో ఇతర వాహనదారులను బెంబేలెత్తించారు. ఆ విన్యాసాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో అప్లోడ్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
పోలీసుల పంజా:
ఈ ఉన్మాదపు డ్రైవింగ్ దృశ్యాలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ బాబు ప్రసాద్ దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే సీరియస్ అయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి, వీడియోల ఆధారంగా గాలించి కేవలం 10 గంటల్లోనే ముగ్గురిని వేటాడి పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో శివ, బాబీ, అఖిల్ అనే ముగ్గురు ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారి ఆటోలను కూడా పోలీసులు సీజ్ చేశారు. అతి చేస్తే అడ్రస్ గల్లంతే! “రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదు” అని పోలీసు అధికారులు గట్టిగా హెచ్చరించారు. వీరు చేసే విన్యాసాల వల్ల వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, ఇలాంటి వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, వీరి తల్లిదండ్రులను పిలిపించి పోలీస్ స్టైల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు.
హెచ్చరిక: రీల్స్ కోసమో, సరదా కోసమో రోడ్లపై విన్యాసాలు చేస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని, డ్రైవింగ్ లైసెన్సులు కూడా శాశ్వతంగా రద్దవుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!