ANDHRA PRADESHOFFICIAL

వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ ద్వారా గ్రామీణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కొత్త దిశ

వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ ద్వారా గ్రామీణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికుల వేతనాలు తెలంగాణ కంటే మెరుగ్గా అమలు

కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు

వెల్దుర్తి జూలై 02 యువతరం న్యూస్:

వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోందని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు తెలిపారు.

గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో “వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ పథకంను జిల్లాస్థాయిలో అధికారికంగా భూమి పూజ చేసి ప్రారంభించిన అనంతరం వెల్దుర్తి ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సభలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. మన జిల్లా కలెక్టర్ సిరి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు.

గతంలో అమలులో ఉన్న గ్రామీణ ఉపాధి కార్యక్రమాల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుతూ, మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సుమారు 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయన్నారు.. గ్రామీణ పేద కుటుంబాలకు మరింత ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ పథకంలో పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం ఎంతో కీలకమైన నిర్ణయమన్నారు. అలాగే శ్రామికులకు చెల్లించే రోజువారీ వేతనాలను కూడా పెంచడం జరిగిందని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వేతనాలు పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధిక సంఖ్యలో కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు గ్రామీణాభివృద్ధికి ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కేంద్ర మంత్రులను రాష్ట్రానికి ఆహ్వానించి, కేంద్ర పథకాల అమలుకు వేగం తీసుకువస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా అర్హులైన ప్రతి కుటుంబం జాబ్ కార్డులు పొందుతూ ఈ పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పేరుతో అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచినట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా పనితీరు ఆధారంగా రోజువారీ కూలీని గరిష్టంగా రూ.320 వరకు పొందే అవకాశం ఉందన్నారు. కూలీలు ఉదయం వేళల్లో పనికి హాజరై కనీసం ఐదు గంటలు పనిచేస్తే పూర్తి కూలీ అందుతుందని, ఆలస్యంగా వచ్చి తక్కువ సమయం మాత్రమే పనిచేస్తే కూలీ తగ్గే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు.. పని చేసిన కార్మికులకు 15 రోజులలోపు కూలీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం, 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించలేకపోతే, దానికి 0.5% వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పాత ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులే కొత్త పథకానికి కూడా చెల్లుబాటు అవుతాయని, కార్మికులు కొత్తగా జాబ్ కార్డులు తీసుకోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లాలో ప్రస్తుతం 26 గ్రామీణ మండలాలు, 484 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, మొత్తం 3.15 లక్షల జాబ్ కార్డులు నమోదై ఉండగా, వాటిలో 2.59 లక్షల జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. అర్హులైన కుటుంబాలు తమ జాబ్ కార్డులను యాక్టివ్ చేయించుకోవడం ద్వారా మరింత మంది ఉపాధి అవకాశాలను పొందవచ్చని కలెక్టర్ సూచించారు.. వ్యవసాయ పనులు అధికంగా ఉండే పీక్ సీజన్‌లో రైతులకు కూలీల కొరత ఏర్పడకుండా సంవత్సరంలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం కల్పించారని, మిగిలిన 125 రోజుల పాటు ఉపాధి పనులు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కార్మికుల హాజరును ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో (అంటే ఏప్రిల్ నుంచి మూడు నెలల్లో) 118 కోట్ల మేర ఎక్స్పెండిచర్ పనుల మీద వ్యయం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

హార్టికల్చర్ ప్లాంటేషన్ పనుల్లో 92 శాతం, కాంపోస్ట్ పిట్స్ నిర్మాణంలో 87 శాతం, సోక్ పిట్స్‌లో 84 శాతం, మ్యాజిక్ డ్రైన్స్ పనుల్లో 85 శాతం లక్ష్య సాధన జరిగిందని కలెక్టర్ వివరించారు.. ‘జలధార–జలహారతి’ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా చేపట్టిన ఫలితంగా 0.43 టీఎంసీల మేర అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోగలిగామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చెరువుల పూడికతీత, నీటి సంరక్షణ పనులు చేపట్టడం వల్ల భూగర్భ జలాల మట్టం మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ముఖ్యంగా కోసిగి వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, కాలువల్లో పూడికతీత, చెట్లు, ముళ్ల కంపల తొలగింపు వంటి పనులను విస్తృతంగా చేపట్టడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల రీఛార్జ్‌కు దోహదపడిందన్నారు.. ఈ చర్యల ఫలితంగా కోసిగి ప్రాంతంలో భూగర్భ జలాల మట్టం సుమారు 8 మీటర్లు పెరిగిందన్నారు. జిల్లాలోని 27 ట్యాంకుల్లో, 35 ఫీడర్లలో పూడిక తీత పని చేయడం వల్ల 11 క్యాస్కేడ్ ట్యాంకులు కూడా నిండి మిగతా కింద ట్యాంకులకు కూడా నీరు వెళ్లడం జరిగిందన్నారు. పెద్దబొంపల్లి, చిన్నబొంపల్లి ప్రాంతాల్లో సాధారణంగా వర్షాకాలం మొత్తం గడిచినా నిండని చెరువులు, ఈసారి రెండు వర్షాలకే నిండడం విశేషమని కలెక్టర్ తెలిపారు.. కర్నూలు జిల్లా కరువు ప్రభావిత ప్రాంతం కావడంతో భూగర్భ జలాల రీఛార్జ్‌కు ఇలాంటి పనులు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అవలంబించాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

ఆడపిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రతి కుటుంబం కృషి చేయాలన్నారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందన్నారు. అదే విధంగా మేనరిక వివాహాల వల్ల పుట్టే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యాలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటువంటి వివాహాలను నివారించి, పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కలెక్టర్ కోరారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటమే కాకుండా కుటుంబానికి, సమాజానికి అండగా నిలుస్తారన్నారు.

గ్రామాల్లో పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు. ఇంటిని మాత్రమే కాకుండా ఇంటి పరిసరాలు, వీధులు, చెరువులు, వాగులు, రహదారులను కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చెత్తను ఇష్టానుసారంగా పడేయడం వల్ల గ్రామం అపరిశుభ్రంగా మారి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. పరిశుభ్రమైన గ్రామమే అభివృద్ధికి, ఆరోగ్యకరమైన జీవనానికి నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ పనుల్లో పాల్గొనే కూలీలకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, షెడ్లు, చిన్నారుల కోసం ఆయా వంటి వర్క్‌సైట్ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కూలీలు నిర్ణీత సమయానికి పనికి హాజరై పూర్తి సమయం పని చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చి తక్కువ సమయం పనిచేస్తే పూర్తి వేతనం రాదని, అందువల్ల ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు.

పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ పథకం వల్ల ప్రతి ఒక్కరికి 100 రోజుల నుంచి 125 రోజుల దాకా (పని దినాలను) పెంచడం జరిగిందన్నారు. వానాకాలంలో బ్రహ్మాండంగా వర్షాలు పడి, రిజర్వాయర్లన్నీ కూడా బాగా నీళ్లు చేరుకొని వ్యవసాయానికి కరెక్ట్‌గా సహాయపడే సమయం అని, కానీ, ఈసారి వానలు కొంచెం విఫలమయ్యేటట్లు ఉన్నాయన్నారు. వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ పథకంను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలన్నారు. అదే విధంగా సంబంధిత పథకం కింద చేసే పనులు శ్రామికులు సక్రమంగా చేయాలన్నారు. జలధార జలహారతి కింద చెక్ డ్యామ్‌లు చాలా బ్రహ్మాండంగా వచ్చాయన్నారు. మొన్న జొన్నగిరిలో ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన సమయంలో సంబంధిత చెక్ డ్యామ్‌ల గురించి ఎక్స్ ప్లెయిన్ చేయడం జరిగిందని, ఆయన చాలా హర్షించారన్నారు. మనం హంద్రీ-నీవా పైన ఎక్కువ ఆధారపడి ఉన్నామని, దాని పక్కన ఉన్న వంకలు అన్నీ కూడా వికసిత్ భారత్ – జీ రామ్‌ జీ’ పథకం కింద క్లియర్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు సంయుక్తంగా తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామంలో జాతీయ స్థాయిలో అధికారికంగా ప్రారంభించిన ‘వికసిత్ భారత్ – జీ రామ్ జీ’ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు ఎంపీ, కలెక్టర్, పత్తికొండ ఎమ్మెల్యే లు వీక్షించారు.

అనంతరం వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి శ్రామికులకు పంచారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు.

కార్యక్రమంలో డ్వామా పిడి నరసింహ రెడ్డి,పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఇంచార్జి జిల్లా పరిషత్ సీఈఓ వెంకట సుబ్బారెడ్డి, డ్వామా ఎపిడి లక్ష్మణ్, పద్మ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!