

అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె జూన్ 18 యువతరం న్యూస్:
రేపల్లె నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రేపల్లె క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో విద్యుత్, డ్రైనేజీ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.



