జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి
కర్నూలు ప్రతినిధి జూన్ 17 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందించాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వలి, శ్రీనివాసులు, రవి, జయబాబు, మధు, ఐజాక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో వెంకటనారాయణమ్మను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పూర్తి ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో వృత్తిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి పిల్లలకు ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించడంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.



