పన్నులు చెల్లించకపోతే ‘దుకాణాలు సీజ్’
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ వెల్లడి

పన్నులు చెల్లించకపోతే ‘దుకాణాలు సీజ్’
గృహాలకు తాగునీటి కొళాయి కనెక్షన్లు కట్
వంద శాతం పన్నులు వసూలుకు యాక్షన్ ప్లాన్
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ వెల్లడి
బకాయిల సముదాయాల వద్ద నిరసన హోరు
కర్నూలు మున్సిపాలిటీ మార్చి 19 యువతరం న్యూస్:
నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి పన్ను, కొళాయి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుములను త్వరితగతిన చెల్లించకపోతే వాణిజ్య సముదాయాల దుకాణాలను సీజ్ చేస్తామని, గృహాలకు తాగునీటి కొళాయి కనెక్షన్లను కట్ చేస్తామని, నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, గృహా, వాణిజ్య దుకాణాల యజమానులను హెచ్చరించారు. చెన్నమ్మ సర్కిల్ సమీపంలోని ఓ ఆసుపత్రి, నగరపాలకకు రూ.7.06 లక్షలు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు జాప్యం చేస్తుండటంతో, మంగళవారం అదనపు కమిషనర్ అధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆసుపత్రిలో బ్యానర్లు ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ఆస్తి, వ్యాపార వాణిజ్య దుకాణాలు, సముదాయాలు కలిగిన ప్రతి పౌరుడు నగరపాలకకు సకాలంలో బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించాలని, ఇందులో నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. స్థానిక ప్రభుత్వం నగరపాలకకు పన్నుల రూపంలో వచ్చిన నిధులతోనే నగరంలో మౌలిక వసతులను కల్పించడం సాధ్యం అవుతుందన్నారు. బకాయిదారులు పన్నులు త్వరితగతిన చెల్లించకపోతే, ఏ నోటీసు జారీ చేయకుండా దుకాణాలను సీజ్ చేస్తామని, గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీల బకాయిదారులు, వాణిజ్య సముదాయ దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ రుసుమును వెంటనే చెల్లించవలసిందిగా సూచించారు. మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, పన్నులను వంద శాతం వసూలుకు యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. నగర ప్రజలు పన్నులను జాప్యం చేయకుండా, సత్వరమే పన్నులను చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అదనపు కమిషనర్ కోరారు.
కార్యక్రమంలో ఆర్‌ఓ జునైద్, రెవెన్యూ ఇంస్పెక్టర్లు జి.ఎం. శ్రీకాంత్, సచివాలయ అడ్మిన్లు, తదితరులు పాల్గొన్నారు.