ముస్లింల పాలిట సంజీవని ‘గంజి’

ముస్లింల పాలిట సంజీవని ‘గంజి’
రంజాన్ నెలలో గంజికి ఎంతో ప్రాధాన్యత
ఉపవాస దీక్షాధారులకు బలవర్ధక ఆహారంగా గంజి
దాతల సహకారంతో మసీదుల వద్ద గంజి పంపిణీ
మంగళగిరి ప్రతినిధి మార్చి 4 యువతరం న్యూస్:
పూర్వం పేద ముస్లింలు అనేక మంది రంజాన్ ఉపవాస దీక్షలు ఉండేవారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పూర్తి చేశాక ఆహారాన్ని తీసుకోవడానికి కూడా వారికి ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు. ఉపవాసం ఉన్నవారు ఇఫ్తార్ వేళకు అన్నం లేకున్నా కనీసం గంజినీళ్లైనా తీసుకోవాలనే భావనతో ఆనాటి నుంచి మసీదుల వద్ద గంజి పంపిణీ ఆనవాయితీగా కొనసాగుతుందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. మొత్తం మీద రంజాన్ ఉపవాసం పాటించే ముస్లింలు ఇఫ్తార్ సమయంలో వివిధ రకాలైన పండ్లు, అల్పాహార పదార్ధాలతో పాటు గంజి తీసుకోవడం పరిపాటిగా మారింది.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను పూర్తిగా పక్కన పెట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలను కొనసాగిస్తున్న ముస్లింలకు ‘గంజి’ పసందు నిస్తుంది. ఉపవాసం పాటించే ముస్లింలు గంజి సేవించడం ద్వారా వారి కడుపును చల్ల బరచడమే కాకుండా బలవర్ధకంగా వారిని తీర్చిదిద్దుతుంది. ఉపవాసం విరమించే సమయంలో పండ్లు, అల్పాహార పదార్ధాలతో పాటు గ్లాస్ గంజినైనా తాగేందుకు ముస్లింలు ఇష్టపడతారు.
గంజి తయారీ విధానం ఇలా:
బియ్యం రవ్వ లేదంటే బొంబాయి రవ్వను ఉపయోగించి ఈ గంజిని తయారు చేస్తారు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద, టమాటాలు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, నెయ్యి లేకుంటే డాల్డా వాడతారు. ముందుగా మసాలా దినుసులు అన్నింటిని నెయ్యి లేదా డాల్డా లో వేయిస్తారు. ఒక పెద్ద వంట పాత్రలో నీళ్లు పోసి బాగా మరగనిస్తారు. నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వను కలుపుతారు. ఆ తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, సరిపడా ఉప్పు వేసి బాగా గంజి చిక్కబడేలా ఉడికిస్తారు. ఇలా తయారు చేసి పంపిణీ చేస్తారు. ఈ గంజిలో బూందీ వేసుకుని ఇష్టంగా తింటారు. ఉపవాస దీక్షాపరుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ గంజిని కుల, మతాలకు అతీతంగా ఇష్టపడటం విశేషం.
దశాబ్దాలుగా గంజి పంపిణీ:
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపేట ఈద్గా మసీదు, పాత బస్టాండ్ సెంటర్ లోని జామియా మసీదుల వద్ద గత నాలుగున్నర దశాబ్దాలుగా గంజి పంపిణీ చేస్తుండగా మస్జీద్ ఎ అమీర్ హంజా, యర్రబాలెం బసవతారక నగర్ లోని మసీద్ ఎ మొహమ్మద్ తదితర మసీదుల్లో గత కొన్నేళ్లుగా రంజాన్ మాసంలో ప్రతి రోజూ సాయంత్రం గంజి పంపిణీ చేస్తున్నారు. వందలాది మంది ముస్లింలు గంజి కోసం తరలివస్తున్నారు.