పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి… జేడి

పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి… జేడి
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 10 యువతరం న్యూస్:
మంగళగిరి ఇందిరా నగర్ యూపీహెచ్సీ పరిధిలోని వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్మ్యూనిజేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె అర్జునరావు హాజరై మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు పిల్లలకు మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చాక్లెట్ మాదిరిగా మాత్రలు నమిలి తినవచ్చన్నారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు అర ట్యాబ్లెట్ పొడి చేసి ఇవ్వాలన్నారు. ఫలితంగా పిల్లల పొట్టలోని నులి పురుగులు చనిపోయి, రక్తహీనత నివారించవచ్చన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఇంటి వద్ద పిల్లలకు కూడా మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మాత్రలు తీసుకోనని పిల్లలకు రెండో విడతలో 17వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అడిషనల్ కమిషనర్ శకుంతల మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో 55 వేల మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 11 యూపీహెచ్సీ పరిధిలోని ఆయా యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష మాట్లాడుతూ నులి పురుగుల వలన పిల్లలలో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గుట, చురుకుదనం లేకపోవడం ఉంటాయని, వాటిని నిర్మూలించడానికి అల్బెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉజ్మా ఫర్హాన, హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.