సమాజంలో చట్టం అందరికీ సమానమే

సమాజంలో చట్టం అందరికీ సమానమే అన్న విషయం మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలి
– ఆం.ప్ర. పోలీస్ అధికారుల సంఘం
(యువతరం ఆగస్టు 10) కర్నూలు ప్రతినిధి;
కర్నూల్ పట్టణంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం పోలీస్ అధికారుల సంఘం నాయకులు శ్రీనివాసరావు, పెద్దన్న, సురేష్, నాగరాజు, శంకరయ్య లు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సమాజంలో ఏ స్థాయి వ్యక్తులైన ఎంతటి వ్యక్తులైన చట్టం ముందు అందరూ సమానమే అనే న్యాయ సూత్రాన్ని మాజీ ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నామన్నారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన మీద హత్య ప్రయత్నం జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని విషయం తెలియదా అని ప్రశ్నించారు.
తనపై హత్యాయత్నం జరిగిందన్న విషయంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వకుండా, బుధవారం ముదివేడు పిఎస్ లో మాజీ ముఖ్యమంత్రి పై కేసు రిజిస్టర్ చేసి ఉన్నందున దాని నుండి తప్పించుకునేందుకు పోలీసులపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం మాజీ ముఖ్యమంత్రి కి తగునా అంటూ నిలదీశారు.
మాజీ ముఖ్యమంత్రి నాయుని వారి చెరువు, హంద్రీనీవా కాలువ, పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు పనులను పరిశీలించే సమయంలో కొంతమంది పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరియు కార్యకర్తలను హింసకు ప్రేరేపించేలా చేసిన వ్యాఖ్యలు అంగళ్లు మరియు పుంగనూరు వద్ద పోలీసులపై భౌతిక దాడులు జరిగేందుకు కారణం అయ్యారన్నారు.
కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కార్యకర్తలను రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు చేసి, హింసను ప్రేరేపించి భౌతిక దాడులను ప్రోత్సహించి తనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అవ్వగానే పోలీసులపై అవాస్తవాలు మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి కి సమంజసమా అంటూ ప్రశ్నించారు.
అంగళ్ళు మరియు పుంగనూరు వద్ద జరిగిన హింసా ఘటనలలో కుట్రలో భాగంగా ముందస్తు పథకం ప్రకారం పోలీసులపై భౌతిక దాడులు చేసి రక్త గాయాలు కలగజేసిన వ్యక్తులు ఎంతటి వారైనా వారి ఉపేక్షించకుండా, చట్టం ముందు నిలబెట్టి సమాజంలో న్యాయం అందరికీ సమానమే అన్న సంకేతాలు పంపాలని రాష్ట్ర డిజిపికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.
ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పోలీసులపై భౌతిక దాడులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కారణమై , కేసు నుండి తప్పించుకునేందుకు, ప్రజలలో సానుభూతి పొందేందుకు పోలీస్ వ్యవస్థ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాము అని పేర్కొన్నారు.