ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్యాకేజ్ స్టార్ కు పది ప్రశ్నలు

ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్యాకేజ్ స్టార్ కు10 ప్రశ్నలు
— వీటికి పవన్ సమాధానం చెప్పి విశాఖకు రావాలి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
(యువతరం, ఆగస్టు 9) విశాఖ ప్రతినిధి:
ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సాకు చూపించి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విశాఖకు రావడాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్పుపట్టారు. బుధవారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సినీ రంగ ప్రవేశానికి విశాఖలోనే ఓనమాలు దిద్దుకున్న పవన్ కళ్యాణ్ విశాఖ నగరానికి చెందిన ఆడబిడ్డను పెళ్లి చేసుకుని వదిలేసిన 15 ఏళ్ల కిందటే ఈ ప్రాంతానికి అన్యాయం చేశాడని విమర్శించారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర వెబ్ సిరీస్-3 విశాఖలో ప్రారంభిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారని ఆయన ఇక్కడికి వస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.
గతంలో ఈ ప్రాంత సమస్యలపై తాము అనేక పోరాటాలు చేసామని అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని ఆయన ప్రశ్నించారు. విశాఖలో పవన్ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు అనుచరులు భూములను ఆక్రమించుకున్నప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పుడు నువ్వు ఎందుకు స్వాగతించలేదని పవన్ కళ్యాణ్ను మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖ ప్రాంత సమస్యలను పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 175 కు 175 సీట్లలో పోటీ చేసే సత్తా ఉందా? పోనీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాలలో వాళ్ల పార్టీ నాయకుల పేర్లు చెప్పమనండి? కనీసం 15 నియోజకవర్గాలలో ఆయన పార్టీ తరఫున పోటీ చేయదల్చుకునే అభ్యర్థుల పేర్లైనా చెప్పమనండి? అని అమర్నాథ్ డిమాండ్ చేశారు. బిజెపితో పొత్తుతో ఉన్న పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు మౌనంగా ఉండటమే కాకుండా ఈ విషయంలో వైసీపీని ఎందుకు తప్పుపడుతున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. బిజెపితో సంసారం, బాబుతో సహజీవనం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఒక విధానం, వ్యవస్థ లేకుండా పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ వాళ్ళను తిట్టడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారని అమర్నాథ్ అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్యాకేజ్ స్టార్ పవన్ కు సంధించిన పది ప్రశ్నలు ఇవే!
1. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా.. విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే.. స్వాగతించకపోగా, వ్యతిరేకించిన నీకు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టి అర్హత ఉందా..?
2. విశాఖ, ఉత్తరాంధ్ర… ఈ అంశాల మీద బాబు స్టాండే జనసేన స్టాండ్, బాబు తానా అంటే నీవు తందానా అంటున్నావ్… నీకు వ్యక్తిత్వం ఉందా..?
3. కేంద్రంలోని బిజెపితో పొత్తులో ఉన్న నీవు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు
ప్రయత్నం చేయలేదు?. పైగా ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు నెడుతున్నావు?
4. విశాఖలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే… కోర్టులో కేసులు వేయించి చంద్రబాబు అడ్డుకున్నప్పుడు బాబుకు తానా తందానగా మారి, పేదల వ్యతిరేక పెత్తందార్ల జాబితాలో ఎందుకు చేరావు?
5. 2014-19 మధ్య 40 గుడులు కూలగొట్టిన మీ జాయింట్ ప్రభుత్వానికి దేవుడు మీద నమ్మకం, మతం అంటే భయం భక్తి ఏ కోశాన లేవు కదా..?
6. పోలవరం ప్రాజెక్టును 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు తన కమీషన్ల కోసం ముందుకు కదలకుండా ఆపితే, అదే బాబుకు ఎందుకు వంత పాడావు?
7. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని మీ పార్టనర్ చంద్రబాబు, మీ ఉమ్మడి పాలనలో కేంద్రానికి మోకరిల్లినప్పుడు నీవు ఎందుకు ప్రశ్నించలేకపోయావ్?, ఇంతకీ పాచిపోయిన లడ్లు.. ఇప్పటికింకా పాచిపోయాయా…? లేక పనసతొనలుగా మారిపోయాయా?
8. ఉద్దానంలో కిడ్నీ జబ్బులతో జనం పిట్టల్లా చనిపోతున్నా. కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని జగన్ గారి ప్రభుత్వం నెలకొల్పిన, డయాలసిస్, రీసెర్చ్ సెంటర్, రక్షిత తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏనాడైనా సంస్కారవంతంగా అభినందించావా..?
9. సంక్షేమ విప్లవంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను, ప్రభుత్వ సేవలను ప్రతి గడపకు అందిస్తున్న వాలంటీర్లను హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ అవమానించిన నీవు వారికి క్షమాపణలు చెప్పాలి.
10. ప్రాజెక్టులపై యుద్ధ భేరి పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, టీడీపీ శ్రేణులను అల్లర్లకు ఉసిగొల్పుతూ, దాడులు చేయిస్తూ, ప్రజలపై దండయాత్ర చేస్తూ, పుంగనూరులో 40 మంది పోలీసులపై దాడి చేస్తే, అందులో ఒక కానిస్టేబుల్ కన్ను పోతే.. ఖండించని నీది ఒక రాజకీయ పార్టీనా..? ఆ పార్టీకి నీవొక అధ్యక్షుడివా..?
-గుడివాడ అమర్ నాథ్
అంటూ మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షంకురిపించారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా తుస్సుమందని సినిమాకు ఎలా స్ట్రెంత్ లేదో .. నీ రాజకీయ పార్టీకి కూడా బలం లేదని నువ్వు రీల్ హీరోవి మాత్రమే.. రియల్ హీరోవి కాదని వచ్చే ఎన్నికల్లో కూడా నువ్వు సీఎం కాలేవని పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు.
విస్సన్నపేట భూములతో నాకేంటి సంబంధం?
విస్సన్నపేటలో 600 ఎకరాలకు సంబంధించి తనపైవచ్చిన ఆరోపణలకు తాను ఇప్పటికే స్పష్టమైన సమాధానం ఇచ్చానని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్నాథ్ సమాధానం చెప్పారు. ఆ భూమిలో తన పేరున, లేదా తన బంధువుల పేరున ఒక్క సెంటు స్థలం కూడా లేదని అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన ఇమేజ్ ను కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.