
మడుగు కాదు రహదారి
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని ముసలిమడుగు గ్రామంలో గల రహదారులు చినుకు పడితే చిత్తడి, చిత్తడి గా మారి అడుగు బయట పెట్టాలంటే బురదలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సచివాలయ అధికారులు సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారి ఈ విధంగా ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వేమరపాటుగా వెళ్లడం శోచనీయమన్నారు స్థానికులు. వర్షపు నీరు బయటికి వెళ్లడానికి దారి లేక ఇళ్ల మధ్యనే మురుగు కుంటలుగా మారి బురదమయంగా రహదారులు కనిపిస్తున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఈ దారి వెంట వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు వెళ్లే దారి లేక బురదలోనే ప్రజలు వెళ్ళవలసి వస్తోంది. గ్రామం లో ఇలా ఉంటే అంటు రోగాలు రావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.