స్టీల్ ప్లాంట్ రక్షణకై ఏ త్యాగానికైనా సిద్ధం

స్టీల్‌ప్లాంట్ రక్షణకై ఏ త్యాగానికైనా సిద్ధం
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే బిజెపిని బంగాళాఖాతంలో కలిపేస్తాం
వి.శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
విశాఖ యువతరం ప్రతినిధి;
విశాఖఉక్కు ప్రజలందరిహక్కు నినాదంతో 32 మంది ప్రాణా త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఏ త్యాగానికైనా సిపిఎం పార్టీ సిద్ధంగా ఉన్నదని, ప్రైవేటీకరణ చేస్తున్న బిజెపిని బంగాళా ఖాతంలో ఈ రాష్ట్ర ప్రజానీకం కలిపేస్తారని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
స్టీల్‌ప్లాంట్ రక్షణ కొరకు జివియంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర 6 జిల్లాల కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు (విశాఖ), కె.లోకనాధం (అనకాపల్లి), పి.అప్పలనర్స(అల్లూరి), టి. సూర్యనారాయణ (విజయనగరం), డి.వెంకటరమణ (మన్యం), డి.గోవిందరావు (శ్రీకాకుళం)లు ఉదయం 10గంటల నుండి శనివారం ఉదయం 10గంటల వరకు 24 గంటలు నిరహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రారంభిస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందన్నారు. దానిలో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్ట్రాటజిక్ సేల్ పేరుతో 100 శాతం అమ్మకానికి పెట్టిందన్నారు. విశాఖ కార్మిక వర్గం, ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా సుమారు 900 రోజుల నుండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం ఆందోళన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వుండే వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక ప్రక్క ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చేపుతూనే మరో ప్రక్కన బిజెపితో అంటకాగుతూ నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా స్టీల్‌ప్లాంట్ కోసం మాట్లాడటంలేదన్నారు. ఈ అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవలసిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. ఈ దీక్షలో కూర్చున్న వారిని డా బి.గంగారావు(సిపిఎం 78వ కార్పొరేటర్) శిబిరంలోకి ఆహ్వానించగా, సిపిఎం విశాఖ కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ దీక్షలకు సంఫీుభావం తెలుపుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి మాజీ సభ్యులు ఎం.వి.ఎస్. శర్మ, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ డి.ఆదినారాయణ, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ లీడర్ పత్రిక సంపాదకులు వి.వి. రమణమూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, ఆది కవి నన్నయ్య యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జార్జ్ విక్టర్, ఉత్తరాంధ్రాభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజశర్మ, అంబేద్కర్ మోమెరియల్ సోసైటీ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డు కళ్యాణరావు, ప్రభాకరరావు, ఐలు రాష్ట్ర నాయకులు బి.వి.రామాంజనేయులు, స్టీల్‌ప్లాంట్ యూనియన్ నాయకులు జె.అమోధ్యరామ్(సిఐటియు), ఎన్.రామచంద్రరావు (ఐఎన్‌టియుసి), విళ్ళా రామ్మోహన్‌కుమార్ (టిఎన్‌టియుసి), సురేష్ (సిఎఫ్‌టియుఐ) రమణారెడ్డి (డివిఆర్), కె.శంకరరావు (ఎఐసిటియు), ఐద్వా కార్యదర్శి వై.సత్యవతి, రైతు సంఘం కార్యదర్శి జి.నాయినబాబు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.ఎస్.ఎన్.రాజు, సంతోష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జె.నాయుడు, వార్వా జిల్లా కార్యదర్శి బి.బి.గణేష్, టిఎన్‌టియుసి జిల్లా అద్యక్షులు నక్కా లక్ష్మణరావు, గిరిజన ఉద్యోగుల సంఘం అద్యక్షులు కె.సత్యనారాయణ, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌లతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సిఐటియు నాయకులు కె.ఎం.శ్రీనివాసరావు, జి.కోటేశ్వరరావు, అమ్మన్ననాయుడు, సురేష్, పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు తదితరులు మాట్లాడారు.