డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ సేవలు చిరస్మరణీయం

డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ సేవలు చిరస్మరణీయం
వెల్దుర్తి యువతరం విలేఖరి;
జూలై 1న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి మరియు ఈయన వర్థంతి కూడ జూలై 1. వీరి జ్ఞాపకార్థం 1962 నుండి జూలై 1ని డాక్టర్స్ డే గా జరుపుతున్నారు. డాక్టర్స్ డే సందర్బంగా
మండల కేంద్రమైన వెల్దుర్తి సి.హెచ్. సి, ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి అద్యక్షతన జూలై 1 న డాక్టర్స్ డే పురస్కరించుకోని డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా శనివారం వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర నాయక్, డాక్టర్.డి ఆలీ సాహెబ్ , హోమియో వైద్యులు ఈ. భారతీదేవి, డాక్టర్ లాలుప్రసాద్ యాదవ్ ,పీజీ వైద్యలు వినయ్, నివేదిత ,షర్మిల, ఫార్మసిస్టులు కృష్ణమూర్తి, స్వర్ణలత , వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి , డాక్టర్ డి. అలీ సాహెబ్,సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.
వైద్యో నారాయణోహరి.. మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే, రోగి ప్రాణం నిలిపేది వైద్యులు మాత్రమే. వైద్యున్ని మన సమాజం పరోక్షంగా భగవత్ స్వరూపంగా కొనియాడుతోంది. ఆధునిక కాలంలో పేదల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో మంది వైద్యులు నిస్వార్థ సేవతో నిరంతరం కృషి చేస్తున్నారు. సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్యులను మనం జూలై 1న వైద్యుల దినోత్సవం సందర్బంగా స్మరించుకోవడం సముచితం అన్నారు. బిధాన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు అని తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడైన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయులు బిధాన్ చంద్ర రాయ్ బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని బంకింపూర్ లో జూలై 1 -1882 న జన్మించారన్నారు. బిధాన్ చంద్ర రాయ్ ఇంగ్లాండ్ లోని సెంట్ బెర్త్ లోమో కాలేజీలో ఎం ఆర్ సి పి మరియు ఎఫ్ ఆర్ సి ఎస్ అనే డిగ్రీలు పొందడానికి చదువు కొనసాగించి 1911 లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోల్ కతా మెడికల్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేసారన్నారు.ఈయన జాదవ్ పూర్ టి.బి.హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలు నెలకొల్పాడన్నారు.1926 లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్యశాలను ఏర్పాటు చేసాడన్నారు.మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థనూ ఏర్పాటు చేసాడు అని తెలిపారు. వీరు 1922-1928మధ్యకాలంలో కలకత్తా మెడికల్ జనరల్ కు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారన్నారు. 1925 సంవత్సరంలో రాజకీయ రంగంలో ప్రవేశించి, బారక్‍పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడని తెలిపారు. 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా నియమించబడినట్లు తెలిపారు. 1948 సంవత్సరంలో జనవరి 13న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారన్నారు. విద్యా, వైద్య రంగాలలో ఈయన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబడింది అని అన్నారు. 1961 లో ఫిబ్రవరి 4 న ఈయనను భారతరత్న వరించింది అని తెలిపారు. వీరి జయంతి రోజైన జూలై ఒకటినే వర్ధంతి కూడా కావడం విశేషం.ఈయన స్మారకార్ధం ప్రతీ ఏడూ జూలై ఒకటవ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962 లో ప్రకటించింది అని తెలిపారు.వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు అని తెలిపారు. ఈయన జూలై 1-1962న స్వర్గస్తులైనట్లు తెలిపారు. సమాజానికి సేవ చేసిన మహనీయులను , అనుక్షణం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి అశయాలను కొనసాగించాలన్నారు.