ANDHRA PRADESHBANKINGCOMMERCIAL

బ్యాంకు టర్నోవర్ 7,700 కోట్ల రూపాయలు అధిగమించేందుకు లక్ష్యం

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు

బ్యాంకు టర్నోవర్ 7,700 కోట్ల రూపాయలు అధిగమించేందుకు లక్ష్యం

విశాఖపట్టణం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు

షేర్ హోల్డర్లను ఒక లక్షకు, షేర్ ధనాన్ని 350 కోట్ల రూపాయలకు చేర్చే లక్ష్యంగా
కార్యాచరణ

2022-23 ఆర్థిక సంవత్సరానికి 73.14 కోట్ల లాభాలు

33.56 కోట్ల మొత్తాన్ని డివిడెండ్ గా చెల్లింపు

విశాఖ యువతరం ప్రతినిధి;

2023-24 ఆర్థిక సంవత్సరం చివరకు బ్యాంకు ఆర్ధిక కార్యకలాపాలను 7,700 కోట్ల రూపాయలు అధిగమించేందుకు, షేర్ హోల్డర్ల సంఖ్యను ఒక లక్షకు, షేర్ ధనాన్ని 350 కోట్ల రూపాయలకు చేర్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విశాఖపట్టణం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలియజేశారు. సోమవారం ద్వారకా నగర్ బ్యాంకు కార్పొరేట్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో ఆయన ఇప్పటివరకు బ్యాంకు సాధించిన విజయాల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ బ్యాంకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి 73.14 కోట్ల లాభాల ఆర్జిచిందని, సభ్యులకు షేరుధనంపై 33.56 కోట్ల మొత్తాన్ని డివిడెండ్ గా చెల్లించడం జరిగిందని తెలియజేశారు.
ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 108వ వార్షిక మహాజనసభ ఈనెల 25న విశాఖ నగరంలోని మద్దిలపాలెంలోగల మాగంటి రవీంద్రనాధ్ చౌదరి కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిందన్నారు. దాదాపు 93 వేల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహించే ఎన్నికైన 418 మంది ప్రతినిధులకుగాను 336 మంది వివిధ బ్రాంచిల నుండి హాజరయ్యారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వార్షిక నివేదికపైన, వివిధ తీర్మానాలపైన, బ్యాంకు పనితీరుపైన, భవిష్యత్ లక్ష్యాలపైన జరిగిన చర్చలలో 26 మంది ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం ముఖ్యమైన తీర్మానాలను మహాజనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు.2023-24 ఆర్థిక సంవత్సరం చివరకు బ్యాంకు ఆర్ధిక కార్యకలాపాలను 7,700 కోట్ల రూపాయలు అధిగమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.నిరర్ధక ఆస్థుల నియంత్రణకు నిర్దిష్ట పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ ప్రయోజనాల రీత్యా మొండి బకాయిదారులు పట్ల కఠిన వైఖరి తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను కోర్టు ద్వారా బహిరంగ వేలం వేసి రుణాలు రికవరీ చేస్తున్నామన్నారు. బ్యాంకు షేర్ హోల్డర్ల షేర్ ధనం పై 12 శాతం లాభాలు ఇవ్వడానికి మహాసభలో తీర్మానించి వెంటనే సభ్యుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.
బ్యాంకు ఎమిరిటస్ చైర్మన్ పదవిని తొలగించాలని రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తెలియజేశారు.ఎన్నికైన పాలకవర్గాల అధికారాలలో జోక్యం చేసుకోవడమేనని, ఈ అంశంలో న్యాయసమీక్షకు ప్రయత్నిస్తున్నామన్నారు. సభ్యుల సంక్షేమ పధకాలలో భాగంగా అమలు చేస్తున్న వైద్య ఖర్చుల తిరిగి చెల్లించే పధకాన్ని మరింత సమర్ధంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు.సంవత్సరాలపాటు నిర్వహణలో లేని ఖాతాలు లేక క్లెయిమ్ చేయని డిపాజిట్లు రిజర్వుబ్యాంకు నిర్వహిస్తున్న ‘డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ నిధి’కి వెళ్ళకుండా లబ్దిదారులను గుర్తించి అందించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బ్యాంకు షెడ్యూల్డ్ హోదాకు కృషిని కొనసాగించాలని మహాసభ మరోసారి నిర్ణయించిందన్నారు. నూతన బ్రాంచిలను ప్రారంభించేందుకు రిజర్వుబ్యాంకు అనుమతి కోసం కృషి చేస్తున్నామన్నారు.అవకాశాలకు అనుగుణంగా బ్రాంచిలకు స్వంత భవనాలను సమకూర్చుకోవడం కోసం కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో
డిపాజిటర్లనందరినీ బ్యాంకు సభ్యులుగా షేర్ హోల్డర్లుగా చేరేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.బ్యాంకు అందిస్తున్న డిజిటల్ సేవలను మరింతగా సులభతరం చేయనున్నామన్నారు
స్థూల నిరర్ధక ఆస్థులను మూడు శాతం మించకుండా కృషి చేయడంతోపాటు నికర నిరర్ధక ఆస్థులను సున్నా శాతం లేక కనిష్ట స్థాయిలో ఉంచే విధంగా కృషి చేస్తామన్నారు.విశాఖ కేంద్రంగా 108 సంవత్సరాలుగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ప్రస్తుతం 50 బ్రాంచిలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్నారు. కోఆపరేటివ సహకార సూత్రాలకు, సిద్ధాంతాలకు, విలువల ప్రాతిపదికగా, సమాజం, ప్రజల శ్రేయస్సు లక్ష్యాలుగా తన విధానాలను రిజర్వుబ్యాంకు నూతన నియమ, నిబంధనల నేపధ్యంలో బ్యాంకు ఆశించిన స్థాయిలో పెరుగుదల లేకపోయినా, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నదని తెలియజేశారు. గత రెండు ఆర్ధిక సంవత్సరాలలో విధానాలలో, ఆచరణలో అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నదన్నారు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ. 3,973 కోట్ల డిపాజిట్లను, రూ.3,052 కోట్ల ఋణాలను చేరుకుని మొత్తం బ్యాంకు ఆర్ధిక కార్యకలాపాలు రూ.7,026 కోట్లను చేరుకున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం దేశంలోని 1514 సహకార అర్బన్ బ్యాంకులలో మొదటి 10-15. బ్యాంకులలో ఒకటిగా గుర్తింపును సాధించడంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి పాలకవర్గం కృతజ్ఞతలు తెలుపుతున్నదన్నారు.
గత రెండు సంవత్సరాలలో బ్యాంకు ప్రగతిని వివరిస్తూ
షేరుధనం సేకరణలో బ్యాంకు దేశంలోనే అర్బన్ బ్యాంకులలో 4వ స్థానంలో నిలవడం సంస్థకు లభించిన గౌరవమనీ తెలియజేశారు. అదేవిధంగా డిపాజిట్ల సేకరణలో 16వ స్థానంలో, ఋణాల జారీలో 14వ స్థానంలో, నికర లాభంలో 9వ స్థానంలో బ్యాంకు నిలవడం అర్బన్ బ్యాంకింగ్ వ్యవస్థలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు స్థానాన్ని, దాని పటిష్ట స్థితిని తెలియజేస్తున్నదన్నారు.
బ్యాంకు సభ్యులకు అందిస్తున్న సంక్షేమ పధకాల ద్వారా సహకార సంస్థల నిజమైన స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోతున్నదని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలోనే రూ.31.33 కోట్లను, వాటిలో గత రెండు సంవత్సరాలలోనే రూ.11.70 కోట్లను సభ్యుల కోసం సంక్షేమ పధకాల నిమిత్తం సంస్థ వెచ్చించిందని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా నిరంతరం తన కార్యకలాపాలలో మిగులు లాభాలును సాధిస్తూ సభ్యులకు నిరంతరం డివిడెండ్లను అందించడం సంస్థ ప్రత్యేకతగా గుర్తించవచ్చునని తెలియజేశారు. ఇందుకు సభ్యులు, ప్రజలు అందిస్తున్న తోడ్పాటు, చూపుతున్న విశ్వాసం ప్రధాన కారణమన్నారు. ఈ కృషి భవిష్యత్తులోనూ కొనసాగగలదని పాలకవర్గం విశ్వసిస్తున్నదన్నారు. ఈ సమావేశంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ బ్యాంకు ఎమిరిటస్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి పీ.వీ.నరసింహా మూర్తి, బ్యాంకు సీనియర్ వైస్ చైర్మన్ గుడివాడ భాస్కరరావు, వైస్ చైర్మన్ ముదిపర్తి రాఘవరావు, డైరెక్టర్ కాకి భవాని, సూర్యలేని నాగభూషణ్ చౌదరి, ఉప్పలపాటి పార్వతీదేవి, తెన్నేటి పద్మావతి తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!