రామళ్లకోటలో పచ్చిమిర్చి పైరును పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు

యువతరం ఎఫెక్ట్
రామళ్లకోటలో పచ్చిమిర్చి పైరును పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
గత శనివారం 17వ తేదీ యువతరం దినపత్రికలో వెల్దుర్తి మండలంలో 2వేల ఎకరాలలో మిరప పంటకు సోకిన వైరస్ అనే కథనం వెలువడిన సంగతి తెలిసిందే.
కథనానికి స్పందించిన మహానంది వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం, జిల్లా ఉద్యాన అధికారి రామాంజనేయులు, బుధవారం మండలంలోని రామళ్ళకోట, బోయినపల్లి గ్రామాలలో పర్యటించి మిర్చి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు, మూడు సంవత్సరముల నుండి మే నెలలో నాటిన పచ్చిమిర్చి పంటకు ఆకుముడత(వైరస్) గమనించినట్లు తెలిపారు. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణం మరియు వర్షాలు ఆలస్యంగా రావడం అన్నారు. ఈ పరిస్థితులు రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పచ్చ దోమ, తెల్ల దోమ ఉధృతికి అనుకూలంగా ఉంటుందన్నారు. పచ్చిమిరప కోసం మే నెలలో నాటిన పైరు పై ఆకుమడప ఆశించడం వలన మొక్కలు గిడస భారీ ఎరుగుదల తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న బెట్ట పరిస్థితులు తెగులు తీవ్రతకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత వాతావరణం తెల్ల దోమకు అనుకూలంగా ఉన్నందున రైతులు పచ్చిమిరప జూన్ మొదటి వారంలో కానీ రెండవ వారంలో కానీ నాటాలని సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారిని విజయలక్ష్మి, ఆర్ బి కే ఉద్యాన సహాయకులు సాంబశివుడు, రైతులు ముక్తార్ భాష, మోహన్ రెడ్డి, వెంకట్ రాయుడు, గొల్ల పుల్లయ్య, దశరథ రాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.