40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు


40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ
పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు
పత్తికొండ టౌన్ జూన్ 17 యువతరం న్యూస్:
పత్తికొండ రైతు సేవా కేంద్రం-3లో మంగళవారం 40 శాతం సబ్సిడీ కింద వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కే.ఈ. శ్యాంబాబు హాజరై రైతులకు విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్-నీనో ప్రభావం నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అలాగే యూరియా, డీఏపీ ఎరువులను ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎలా కొనుగోలు చేసుకోవాలో రైతులకు వివరించారు. డీలర్ల వద్ద తమ పేరు కనిపించని పక్షంలో రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
తుగ్గలి మండలానికి మొత్తం 1,752 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఒక క్వింటా వేరుశనగ విత్తనాల ధర రూ.10,200 కాగా, ప్రభుత్వం రూ.4,080 సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులు కేవలం రూ.6,120 మాత్రమే చెల్లించి విత్తనాలు పొందవచ్చు. రైతులకు అవసరమైతే మరిన్ని విత్తనాలు తెప్పించే ఏర్పాట్లు చేస్తామని తుగ్గలి మండల వ్యవసాయ అధికారి సురేష్‌బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర, బత్తిని వెంకటరాముడు, వెంకటపతి, మనోహర్ చౌదరి, ఎర్రగుడి వెంకటస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పత్తికొండ వ్యవసాయ ఏడీఏ మోహన్ విజయ్, పత్తికొండ ఏవో వెంకటరాముడు, మద్దికేర ఏవో రవికుమార్, తుగ్గలి వ్యవసాయ అధికారి సురేష్‌బాబు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



