ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి


ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
జిల్లాలో 55 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు
జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి
నంద్యాల ప్రతినిధి ఫిబ్రవరి 08 యువతరం న్యూస్:
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఓ శంకర్ నాయక్, జిల్లా కార్మిక అధికారి బషీరున్నిసా, ఎస్ఎస్ఎ పీఓ నిత్యానంద రాజు, డీఈసీ సభ్యులు సునీత, సుంకన్న, మద్దిలేటి స్వామి, రమణ, శ్రీకాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు డిప్యూటీ తహశీల్దార్లను కేటాయించాలని డీఆర్ఓను ఆదేశించారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 15,443 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం పరీక్షలకు 14,424 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, మొత్తం 29,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తగినంత లైటింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా గదిలో గోడ గడియారం ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రహదారులకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను భద్రతతో పోస్టు కార్యాలయాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ శాఖ అధికారులను ఆదేశించారు.
అదనపు ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, ప్రశ్న పత్రాల సెట్టు నెంబర్లు అందిన వెంటనే పోలీసు ఎస్కార్ట్‌తో పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తరలించే ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు.



