వెల్దుర్తి మండలం లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
రోజు వందల ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా

వెల్దుర్తి మండలం లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
రోజు వందల ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా
వెల్దుర్తి మార్చి 10 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతున్నట్లు వెల్దుర్తి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వెల్దుర్తి మండలం చెరుకులపాడు నుండి రాత్రి,పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతున్నట్లు వెల్దుర్తి మండలంలో చర్చ కొనసాగుతోంది. వాల్టా చట్టాన్ని పక్కకు నెట్టేసి సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చెరుకులపాడు గ్రామంలోని వంకలు ,వాగులలో ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని మండల ప్రజలు తెలుపుతున్నారు. ఇలా అయితే బోరు బావులకు ఊట తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించే ప్రసక్తే లేదని పదేపదే చెప్పడం గమనర్హం. అక్రమ ఇసుక రవాణా ఎవరు నిర్వహించిన చర్యలు తప్పవని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి సంబంధిత అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులు ప్రతిరోజు దాదాపుగా వందల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణాను ట్రాక్టర్ల ద్వారా కొనసాగిస్తున్నారని మండలంలో చర్చ జోరుగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని వెల్దుర్తి మండల ప్రజలు కోరుతున్నారు.