బ్యాంకు మెట్లు ఎక్కుతూ తీవ్ర రక్తస్రావం కడుపులో బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణి

బ్యాంకు మెట్లు ఎక్కుతూ తీవ్ర రక్తస్రావం కడుపులో బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణి
కోసిగి మార్చి 8 యువతరం న్యూస్:
రెండో అంతస్తులో ఉన్న స్టేట్ బ్యాంకులోని తన ఖాతాలో
డబ్బులు తీసుకోవాలని మెట్టు ఎక్కిన జాల మంచి అంజలి అనే నిండు గర్భిణి కడుపు లోని బిడ్డను పోగొట్టుకున్న ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో జరిగింది. కోసిగి లోని 6వ వార్డులో రంగప్ప గట్టు సమీపంలో నివాసం ఉంటున్న జాలమంచి సురేష్, అంజలి దంపతులకు ఒక కూతురు ఉండగా ప్రస్తుతం 8 నెలల గర్భిణి. ఈ నెల 12న ప్రసవానికి వైద్యులు తేదీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె స్టేట్ బ్యాంకులో ఈకేవైసీ చేయించుకోవడంతోపాటు ఖాతాలోని డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వచ్చారు. బ్యాంకు రెండో అంతస్తులో ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ఆమెను సుమారు 25 మెట్లు ఎక్కించి పైకి తీసుకెళ్లినట్లు భర్త సురేష్ పేర్కొ న్నారు. ఆ సమయంలో ఆమెకు రక్తస్రావం అధికం కావడంతో ఎత్తుకుని కిందకు దింపినట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆమెను కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తల్లికి, కడుపు లోని బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రథమ చికిత్స చేయి మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ ఆమెకు ప్రసవం చేయగా మగ బిడ్డ పుట్టి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోదించారు.