వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం..

వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం..
పల్లకిలో ఊరేగిన గవిమఠం పీఠాధిపతులు
ఆకట్టుకున్న సంప్రదాయ కళాకారుల నృత్యాలు..
ఉరవకొండ మార్చి 07 యువతరం న్యూస్:
ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం “అడ్డపల్లకి-గ్రామోత్సవం” వైభవంగా జరిగింది. పట్టణంలోని వెలిగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతి వారికి గవిమఠం సహాయ కమిషనర్ రాణి, ఉప పీఠాధిపతులు, అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి జగద్గురు శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల గుండా మేళాతాలాలు, డప్పులు, సంప్రదాయ నృత్యాల నడుమ ఘనంగా ఉరేగించారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రానికి చెందిన కళాకారుల అమ్మవారి తాండవాలు, వీరభద్ర వేషదారి నృత్యం పలువురిని ఆకట్టుకుంది. అదే విదంగా డప్పు వాయిస్తూ కళాకారులు చేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేసాయి. ఈ ఉత్సవంలో గవిమఠం గజలక్ష్మి (ఏనుగు) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కల్యాణి స్వామి, అల్లూరి సిద్దగంగ మఠం పీఠాధిపతి చెన్నబసవ స్వామి, హిరే మఠం పీఠాధిపతి గురులింగ శివాచార్యులు, హత్తిగూడూరు అమాదేస్వర మఠం పీఠాధిపతి గిరి మల్లేశ్వరస్వామి, ఏజెంట్ రాజన్న గౌడ్, మఠం సిబ్బంది గోపి, నారాయణస్వామి, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.