ANDHRA PRADESHBREAKING NEWSPOLITICSSTATE NEWS

వైసీపీకి ఎంపీపీ ఫీవర్

వైసీపీకి ఎంపీపీ ఫీవర్

ఎంపీపీ పదవిపై టీడీపీ కన్ను

కలిసిరానున్న వైసీపీ అంతర్గత విభేదాలు

టీడీపీలోకి చేరిన వైస్ ఎంపీపీ కాయల మహేష్

లాంఛనమే అంటున్న టీడీపీ నేతలు

పామిడి జూలై 26 యువతరం న్యూస్ :

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాకు సైతం నోచుకోని వైసీపీకి మండలంలో ఎంపీపీ ఫీవర్ పట్టుకుంది. వైసీపీ ఎంపీటీసీల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు గత ఏడాదిగా తారా స్థాయికి చేరుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడంతో పామిడి ఎంపీపీ పదవిపై టీడీపీ కన్నుపడింది. అనుకున్నదే తడువుగా చకచకా పావులు కదిపారు. ఇటీవలే వైస్ ఎంపీపీ కాలయ మమేష్ టీడీపీ గూటికి చేరారు. బలపరీక్షకు అవిశ్వాసానికి వైసీపీ ఎంపీటీసీలే ఆసక్తి కనపరుస్తుండడం విశేషం. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పామిడి నగర పంచాయతీగా ఏర్పడడంతో గ్రామీణ ప్రాంతాలలోని ఎనిమిది (ఎదురూరు, గజరాంపల్లి, దేవరపల్లి, ఖాదర్పేట, రామగిరి, పాళ్యంతండా, ఎద్దులపల్లి, వంకరాజుకాలువ) ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎదురూరు స్థానంను వైసీపీ అభ్యర్థిగా భోగాతి మురళిమోహన్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. అయితే ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాల దృష్ట్యా టీడీపీ అధిష్టానం పోటీ నుంచి
విరమించుకుంటున్నామని తెలియజేయడంతో తెలుగు తమ్ముళ్లు పట్టించుకోలేదు. దీంతో వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాలు ఇలా :

టీడీపీ అధిష్టానం బరిలో నిలిచేది లేదని చెప్పినప్పటికీ వంకరాజుకాలువ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎం జయమ్మపై టీడీపీ అభ్యర్థి ఎల్ సువర్ణ 424 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. దీంతో జయమ్మ అపజయంను చవిచూడాల్సి వచ్చింది. అలాగే ఎద్దులపల్లి స్థానంలో అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి చుక్కలూరు రామకృష్ణారెడ్డిపై బీజేపీ సీనియర్ నాయకులు గండికోట సుధాకర్ శర్మ స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగి 220 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గజరాంపల్లి స్థానానికి టీడీపీ అభ్యర్థి సిరిచాటి రామలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి రంగమ్మ 871 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈమెనే సర్పంచుగా కూడా పోటీ చేసి గెలుపొందడంతో తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి సర్పంచుగా కొనసాగారు. దీంతో గజరాంపల్లి స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గవ్వల ఆదిలక్ష్మిపై టీడీపీ అభ్యర్థి సిరిచాటి రామలక్ష్మి 202 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగుర వేశారు. ఇక మిగిలిన ఖాదర్ పేట స్థానంలో వైసీపీ అభ్యర్థి కాయల మహేష్, పాళ్యంతండా స్థానంలో వైసీపీ అభ్యర్థి నీలాబాయి, రామగిరి స్థానంలో వైసీపీ అభ్యర్థి మజ్జిగ రాజశేఖర్, దేవరపల్లి స్థానంలో వైసీపీ అభ్యర్థి నక్కా సౌభాగ్య విజయం సాధించారు. వైస్ ఎంపీపీ కాయల మహేష్ టీడీపీలోకి చేరడంతో ముగ్గురు టీడీపీ సభ్యులు, నలుగురు వైసీపీ సభ్యులు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. వైసీపీ నుంచి మరొక ఎంపీటీసీ త్వరలోనే టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

దినదిన గండంగా ఎంపీపీ పదవి :

పామిడిలో వైసీపీ ఎంపీపీ పదవికి కావాల్సినంత మెజార్టీ ఉన్నా ఉత్కంఠే. ఎంపీటీ సీ ఎన్నికల్లో అప్పటి ఏడీసీసీ చైర్మన్ వీరాంజనేయులు తన రాజకీయ చతుర్థతతో ఎలాంటి వివాదాలు లేకుండా ఎదురూరు స్థానంలో భోగాతి మురళిమోహన్ రెడ్డిని ఏకగీవ్రంగా ఎన్నిక చేయించారు. ఎంపీపీ అభ్యర్థి అంటూ వైసీపీ ప్రకటించింది. రాష్ట్రంలో అనుకొని పరిస్థితుల వల్ల ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే అప్పటి ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ వీరాంజనేయులు మధ్య మనస్పర్థలు తలెత్తి రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో మురళిమోహన్ రెడ్డి ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ వీరాంజనేయులు కోటరి నుంచి ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి కోటరిలోకి చేరారు. ఆ తరుణంలో గుత్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెమ్మక చెన్నకేశవరెడ్డి వైసీపీ గూటికి చేరారు. తర్వాత ఎంపీటీసీ ఎన్నికలకు కోర్టు అనుమతించడంతో ఎద్దులపల్లి వైసీపీ అభ్యర్థి చుక్కలూరు రామకృష్ణారెడ్డిని ఎంపీపీ అభ్యర్థిగా పోటీ అవకాశం లేకపోలేదు. దీంతో ఆయన ఓటమికి కొందరు వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొదట్లో వైసీపీకి ఆరు స్థానాలు రాగా ఉప ఎన్నికల్లో గజరాంపల్లి స్థానాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ వైసీపీకి మెజార్టీ స్థానాలు ఉండడంతో ఎంపీపీగా భోగాతి మురళిమెహన్ రెడ్డి ఎంపికకు మార్గం సుగమమైంది. ఎంపీపీ పదవి ఎంపిక తరుణంలో అప్పటి ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ వీరాంజనేయులు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్కు హాజరుకాలేదు. దీంతో గంటల వ్యవధి ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవి ఎంపిక పూర్తి అయినప్పటికీ పామిడి పెండింగ్ ఉంది. దీంతో చేసేదేమీలేక ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి స్వయంగా బరిలోకి దిగి పామిడికి చేరుకున్నారు. పరిస్థితిపై ఆరా తీసి ఓటింగ్ కు గైర్హాజరైన ఎంపీటీసీలతో చర్చించారు. అనంతరం ఎంపీపీ ఎంపిక జరిగింది. ప్రతి మూడు మాసాలకు ఒకమారు జరిగే మండల సర్వసభ్య సమావేశం కూడా సమ స్యాత్మకంగానే సాగుతోంది. వైసీపీ ఎంపీటీసీ సభ్యుల అంతర్గత విభేదాలతో కోరం లేక గంటల పాటు ఆలస్యంగా మండల మీట్ ప్రారంభమైన సంఘటనలూ లేకపోలేదు. ఇలా ఎంపీపీ తన పదవిని దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా కొనసాగిస్తున్నారు.

అసంతృప్తి ఎంపీటీసీలతో మంతనాలు :

అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ భోగాతి మురళిమోహన్ రెడ్డికి అనుకూలమైన నేతలు మంతనాలు జరుపుతున్నారన్నట్లు తెలిసింది. గతంలో వైసీపీకి చెందిన ఇద్దరి ఎంపీటీలకు అవసరమైన పనులు చేయడంలోనూ, చేసిన పనులకు బిల్లుల మంజూరు చేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆ ఎంపీటీసీలు ఆవేదనను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. నాడు ద్వేషించిన ఎంపీటీసీలపైనే ప్రస్తుత ఎంపీపీ భవితవ్యం ఆధారపడి ఉందని మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తి ఎంపీటీసీలను వైసీపీకే మద్దతుగా నిలిచేలా నానా తంటాలు పడుతున్నారు. ఆ ఇద్దరి ఎంపీటీసీలకు తాయిళాలు సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఎంపీపీపై టీడీపీ గురి :

ప్రస్తుతం ఎలాగైనా ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇద్దరు టీడీపీ సభ్యులు, ఒకరు స్వతంత్య్ర సభ్యుడు, ఇద్దరు వైసీపీ అసం తృప్తి సభ్యులుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో హోదా ఓటుతో ఎంపీపీ పదవిని సులభతరంగానే చేజిక్కించుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. వైసీపీ ఎంపీటీసీలు మద్దతు తెలియజేయకపోయినా ఎంపీపీ పదవి దక్కించుకోవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ఎంపీపీ పదవితో టీడీపీలో మరోసారి నూతనోత్తేజం నింపేందుకు నేతలు ఉర్రూతలూగుతున్నారు. అయితే ఎంపీపీ పదవి కైవసం చేసుకునేందుకు టీడీపీ, ఎలాగైనా కాపాడుకునేందుకు వైసీపీ అంతర్గత యుద్ధం సాగిస్తోందని మండలంలో చర్చనీయాంశంగా మారింది.. ఈ అంతర్గత యుద్ధంలో విజేతలెవరన్నది వేచిచూడాల్సిందే.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!