హోటల్లు రెస్టారెంట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

హోటళ్లు, రెస్టారెంట్లను పరిశుభ్రంగా ఉంచుకోండి
నాణ్యమైన సరుకులతో ఆహార పదార్థాలను తయారు చేయండి
జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
నంద్యాల కలెక్టరేట్ జూన్ 28 యువతరం న్యూస్:
ప్రజల ఆరోగ్య దృష్ట్యా వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర తినుబండారాల విక్రయశాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా వంట గదుల్లో క్రిమి కీటకాదులు ప్రవేశించకుండా నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తయారుచేసిన ఆహార పదార్థాలను ఓపెన్ గా ఉంచకుండా మూతలను కప్పి ఉంచాలన్నారు. శాఖాహార, మాంసాహార ఆహార పదార్థాల తయారీలో నాసిరికం ముడి సరుకులు, కృత్రిమ రసాయన రంగులు, టెస్టింగ్ సాల్ట్ తదితర పదార్థాలు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన, మేలు రకమైన ముడి సరుకులను ఆహార పదార్థాల తయారీకి వినియోగించాలని ఆయన సూచించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సురక్షిత మంచినీటితో పాటు వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలను సప్లై చేయాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లో పనిచేసే సిబ్బందికి హెడ్ క్యాప్స్, యూనిఫామ్స్ తప్పక ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హోటళ్లు, రెస్టారెంట్ల ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ ఫుడ్ లైసెన్స్ కౌంటర్ నందు వినియోగదారులందరికీ కనపడేలా ప్రదర్శించాలన్నారు. లైసెన్స్ లేని ఎడల ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ యాక్ట్ 2006 చట్టం ప్రకారము చర్యలు తీసుకోబడునని జెసి తెలిపారు. ఆహార పదార్థాలు కుళ్ళిన, చెడిపోయిన, వాసన కలిగిన నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల వివరాలను జిల్లా ఆహార బధ్రత కార్యాలయం, డోర్ నెం.28-14-66, రైల్వే స్టేషన్ రోడ్, 25వ వార్డు సచివాలయం దగర, నూనేపల్లి, నంద్యాల జిల్లా వారికీ లిఖిత పూర్వకముగా పిర్యాదు చేసినా లేదా 9441439787, 9441114429, 9494937578 కాల్ చేసినా చట్ట పరంగా సంబంధిత సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.