మరుగుదొడ్లా….. చికెన్ దుకాణమా…..?????

మరుగుదొడ్లా… చికెన్ దుకాణమా..!
(యువతరం సెప్టెంబర్ 25) మంగళగిరి ప్రతినిధి:
నిత్యం రద్దీగా ఉండే ఓ నగరంలోని మెయిన్ బజార్… నగర చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ తమ అవసరాలు సంబంధించి సరుకులు తదితర వస్తువులు కొనుగోలు చేసుకొని వెళుతూ ఉంటారు. అయితే మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, చిరు వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. తమ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి మరుగుదొడ్లు నిర్మాణం చేయించారు. అయితే నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరుగుదొడ్లను వ్యాపారస్తులు తమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. వివరాలు చూద్దాం…
మంగళగిరిలో దేవస్థానం సెంటర్ నుంచి మిద్దే సెంటర్ వరకు ఉన్న మెయిన్ బజార్లో మున్సిపల్ కార్పొరేషన్ మరుగుదొడ్లు లేక ప్రజలు, చిరు వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిన్ బజార్లో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) పర్యటించే సమయంలో ప్రజలు, వ్యాపారస్తులు మరుగుదొడ్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆర్కే తక్షణమే స్పందించి మాంసం మార్కెట్ వెనుక మరుగుదొడ్లు నిర్మించాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. దీంతో కార్పొరేషన్ అధికారులు మరుగుదొడ్లు నిర్మించి, వాటర్ ట్యాంక్ తో పాటు బోరు వేసి మోటార్ బిగించారు. కానీ అధికారులు నెలలు గడుస్తున్నా ప్రారంభించకుండా వదిలేశారు.
దీంతో మాంసం మార్కెట్, చికెన్ స్టాల్స్ యజమానులు మరుగుదొడ్లను కోళ్లలను నిలవ ఉంచుకోవడానికి చిన్నపాటి గోడౌన్ గా వాడుకుంటూ తాళాలు వేసుకుంటున్నారు. బోరుకు బిగించిన మోటారును టూబుల సహాయంతో నీటిని మార్కెట్లో మాంసం విక్రయాలకు సమయంలో వాడుకుంటున్నారు. మూగజీవాలను కబేలాలో వధించకుండా మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం జరిపిన మరుగుదొడ్ల వద్ద మూగజీవాలను వధిస్తూ బోరుతో ఉన్న మోటార్ నుంచి నీరు వాడుకుంటున్నారు. ప్రజల చిరు వ్యాపారస్తుల కోసం నిర్మాణం జరిపిన మరుగుదొడ్లను మాసం మార్కెట్, చికెన్ స్టాల్ యజమానులు తమ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆర్కే చొరవ తీసుకొని మరుగుదొడ్లు ఉపయోగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.