రానున్న ఎన్నికల్లో బిజెపిని పారద్రోలాలి

రానున్న ఎన్నికల్లో బిజెపిని పారద్రోలాలి
-ఎన్డీఏ నుంచి సీఎం జగన్ బయటకు రావాలి
-నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎస్.కే. జలీల్
(యువతరం ఆగస్టు 19)మంగళగిరి ప్రతినిధి:
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లను రానున్న 2024 ఎన్నికల్లో దేశం నుంచి పారద్రోలాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎస్.కే. జలీల్ పిలుపునిచ్చారు. ఐబీఎం భవన్ ప్రెస్ క్లబ్ లో శనివారం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను ఊచకోత కోస్తున్నారని, క్రైస్తవుల చర్చిలను తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అటువంటి బిజెపి ప్రభుత్వానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలపడం బాధాకరమని, తక్షణమే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని పారద్రోలకపోతే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఉద్యమాలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు. రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయునికి రూ.7,500 పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. విద్య ఉద్యోగ రంగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కేటాయిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఉచితంగా రుణమాఫీ చేస్తామని, రైతులకు రైతు భరోసా తీసివేసి వడ్డీ లేని రుణం అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇస్తామని, పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడులు తెప్పిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ఖరీదు రూ.350 చేసి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, విదేశీ విద్య అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతి విద్యార్థికి నెలకు పదివేల రూపాయలు అందజేస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి పూర్తి వైద్యం ఉచితంగా అందజేయడంతో పాటు అకాల మరణం చెందిన ప్రతి మనిషికి రూ. పది లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మహిళలకు బస్సు , రైల్వే లో ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని, ప్రతి రంగంలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. నదులను అనుసంధానం చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడి అడవులను రక్షిస్తామన్నారు. కొత్త న్యాయస్థానాలను తప్పించి న్యాయస్థానంలో ఉన్న కేసులను ఆరు నెలల్లో పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలకు ఉన్న వేల కోట్ల పండును ప్రభుత్వం జప్తు చేసి పేదలకు పంచే విధంగా పార్లమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ద్వారా బిల్లుని ఆమోదముద్ర వేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఓటుకి డబ్బులు ఇచ్చిన వారిని నిర్బంధించి జైలుకు పంపే విధంగా కొత్త చట్టాలను తెస్తామని, దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలకు ఉన్న రుసుమును తీసివేసి ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు దేవాలయాలకు ఉన్న భూములను ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు రెండు ఎకరాల భూమి ఉచితంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ జయ బాబు, ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు షేక్ ఫక్రుద్దీన్, నవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మస్తాన్, షేక్ మునాఫ్, ఎస్ డి రషీద్ తదితరులు పాల్గొన్నారు.