ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు
చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సవిత

ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు ఎన్
చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సవిత
త్వరలో ‘నేతన్న భరోసా’ అమలు
చేనేత సహకార సంఘాలకు రూ.6.50 కోట్ల బకాయిలు కూడా…
ఈ నెల 15న రూ.4కోట్లు, ఆగస్టు మొదటి వారంలో రూ.2.50 కోట్ల బకాయిల చెల్లింపు
నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా నూలు సరఫరా
చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనే కూటమి లక్ష్యం
ఆప్కోకు పూర్వ వైభవం తీసుకొస్తాం
చేనేత బ్రాండ్ అంబాసిడర్లగా చంద్రబాబు, పవన్, లోకేశ్ : మంత్రి సవిత
మంగళగిరిలో ఘనంగా ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు
మంగళగిరి ప్రతినిధి జులై 7 యువతరం న్యూస్:
ఆప్కో స్వర్ణోత్సవం సందర్భంగా నేతన్నలకు, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వరాల జల్లు కురిపించారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన రూ.4 కోట్లు, వచ్చే నెల మొదటివారంలో మరో రూ.2.50 కోట్లు బకాయిలు అందజేయనున్నామన్నారు. నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందజేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఆప్కో బలోపేతానికి చర్యలు తీసుకున్నామన్నారు. మంగళగిరిలోని ఆప్కో తోటలో ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తాను చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆప్కో స్వర్ణోత్సవాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏ లక్ష్య సాధనకు ఆప్కోను ఏర్పాటు చేశారో ఆ దిశగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. •అన్న ఎన్టీఆర్ జనతా వస్త్రాల పేరుతో చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు… నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే, ఏపీ చేనేత రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్నారన్నారు. ఆప్కోలో చేపట్టిన డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు. ఆప్కోను లాభాల పట్టేలా ప్రక్షాళన చేపట్టామన్నారు. నేటితరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, చేనేత రెడీమెడీ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణను నేతన్నలకు అందజేస్తున్నామన్నారు. నేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా డైయింగ్, బ్లీచింగ్ ఛార్జీలు, టవల్స్, ఇతర వస్త్రాల నేత ఛార్జీలు పెంచామన్నారు. త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రెడీమేడ్ వస్త్రాల తయారీపై చేనేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
*త్వరలో రూ.6.50 కోట్ల బకాయిల చెల్లింపు*
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ, 2014-19లో సీఎం చంద్రబాబునాయుడు పాలన చేనేత రంగానికి స్వర్ణయుగం లాంటిందన్నారు. తరవాత వచ్చిన జగన్ …అన్ని వ్యవస్థల మాదిరిగానే చేనేత రంగాన్ని భ్రష్టుపట్టించారన్నారు. ఆప్కో పేరు మీద తీసుకొచ్చిన రూ.100 కోట్లను జగన్ పక్కదారి పట్టించారన్నారు. ఇప్పుడు ఆ బకాయి భారం ఆప్కోపై పడిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేత సహకార సంఘాల కొనుగోలు చేసిన వస్త్రాలకు నగదు చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 15న సంక్షేమ హాస్టళ్లకు అందజేసిన దుప్పట్లు, ఇతర వస్త్రాలకు చెందిన రూ.4 కోట్ల బకాయిలను చెల్లించనున్నామన్నారు. వచ్చే నెల మొదటివారంలో సాధారణ చేనేత ఉత్పత్తులకు రూ.2.50 కోట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఆప్కో బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఆ సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి సవిత తెలిపారు.
*చేనేత బ్రాండ్ అంబాసిడర్లగా చంద్రబాబు, పవన్, లోకేశ్*
అందరూ చేనేత వస్త్రాలు ధరించాలంటూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆ ముగ్గురూ బ్రాండ్ అంబాసిడర్లగా వ్యవహరిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగానికి మరోసారి స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. చేనేతలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ఏటా త్రిఫ్డ్ ఫండ్ కింద రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయించామన్నారు. 15 శాతం సబ్సిడీతో నూలు అందజేస్తున్నామన్నారు. నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందజేసే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆప్కో చరిత్రలో మొట్టమొదటిసారిగా టీటీడీతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన చేనేత సహకార సంఘాలు ముందుకొస్తే… టీటీడీకి అవసరమైన దుశ్శాలువాలు, చీరలు, జాకెట్లు, కండువాలు పంపిణీ చేసే ఆర్డర్ ఇస్తామని మంత్రి సవిత తెలిపారు. అనంతరం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత సహకార సంఘలా ప్రతినిధులను మంత్రి సవిత సత్కరించారు. ఆప్కోలో పనిచేసే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.1.20 లక్షల విలువ చేసే బెనిఫిట్స్ ను చెక్ రూపంలో మంత్రి సవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ప్రతినిధులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వర్, ఆకాశపు స్వామి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ధనుంజయ రావు, పెద్ద సంఖ్యలో నేతన్నలు, పాల్గొన్నారు.



