గ్రామ సేవకుడి ‘రౌడీయిజం’
జర్నలిస్ట్‌పై జేబురౌడీలా పడ్డ ‘సేవకుడు’ విజయుడు

ఉయ్యాలవాడ గ్రామ సేవకుడి ‘రౌడీయిజం’
జర్నలిస్ట్‌పై జేబురౌడీలా పడ్డ ‘సేవకుడు’ విజయుడు
ఫోన్ లాక్కొని, అనుచరులతో దాడికి యత్నం!
కలెక్టర్, ఎస్పీ పర్మిషన్ ఉంటేనే ఫోటోలు తీయాలా?
గ్రామ సేవకుడి’సొంత రాజ్యాంగం’పై ముక్కున వేలేసుకుంటున్న జనం!
ఖాకీల దెబ్బకు దిగొచ్చిన గర్వం.. ఎఫ్ఐఆర్ నమోదు.
కలెక్టర్ గారు ఈ ‘అవినీతి తిమింగలాన్ని’ సస్పెండ్ చేయండి
కర్నూలు ప్రతినిధి జూన్ 08 యువతరం న్యూస్ :
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలు ఎంతలా భ్రష్టుపట్టిపోతున్నాయో, కిందిస్థాయి సిబ్బందికి అధికార అహంకారం ఏ రేంజ్లో తలకెక్కిందో చెప్పడానికి ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడలో జరిగిన ఈ అరాచకమే సజీవ సాక్ష్యం! సమాజంలో జరుగుతున్న అక్రమాలను వేలెత్తి చూపడమే ఆ జర్నలిస్ట్ చేసిన నేరమా? నిబంధనల ఉల్లంఘనను కెమెరాలో బంధిస్తే ఒక ప్రభుత్వ నౌకరు వీధి రౌడీలా ప్రవర్తించాలా? జర్నలిస్ట్‌పై బూతుపురాణంతో విరుచుకుపడి, భౌతిక దాడికి తెగబడ్డ స్థానిక గ్రామ సేవకుడు విజయుడి దౌర్జన్యకాండ ఇప్పుడు కర్నూలు జిల్లావ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.
పొలాలు వదిలి.. బస్టాండ్ అడ్డాగా సాగిన ‘దగా’!
గత ఏడాది అక్టోబర్ 6వ తేదీ ఉదయం 7:30 గంటల సమయం.. రైతుల పొలాల్లో తిరిగి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి చేయాల్సిన అత్యంత కీలకమైన ‘పంట నమోదు’ (క్రాప్ బుకింగ్) కార్యక్రమాన్ని సదరు గ్రామ సేవకుడు విజయుడు ఉయ్యాలవాడ గ్రామ బస్టాండ్ సెంటర్లో కూర్చొని దర్జాగా, తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నాడు. ప్రభుత్వ ఆశయాలకు నడిరోడ్డుపై తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ పెద్ద దగాను స్థానిక జర్నలిస్ట్ మల్లికార్జున గమనించారు. నిబంధనల ఉల్లంఘనను సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తన మొబైల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీశారు.
గుమ్మడికాయ దొంగలా ఉలిక్కిపాటు.. జర్నలిస్ట్‌పై వీధిరౌడీలా దాడి.
తాను చేస్తున్న లీలలు ఎక్కడ పైఅధికారులకు తెలిసి తన ఉద్యోగం ఊడుతుందోనన్న భయంతో తలారి విజయుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తప్పు ఒప్పుకోవాల్సింది పోయి, ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు.. జర్నలిస్ట్ మల్లికార్జునపైకి లంఘించి ఆయన చేతిలోని మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నాడు. తాను జర్నలిస్ట్‌నని, ఫోన్ ఇవ్వాలని కోరినప్పటికీ.. కనీస సంస్కారం, ప్రభుత్వ ఉద్యోగి అనే విచక్షణ మరిచి, అందరి ముందూ అత్యంత నీచమైన పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. అంతటితో ఆగకుండా, తన వెనుక ఉన్న ‘బ్యాక్‌గ్రౌండ్’ చూపిస్తానంటూ, తన అనుచరులను ఉసిగొల్పి జర్నలిస్ట్‌పై భౌతిక దాడికి సైతం తెగబడ్డాడు.
గ్రామ సేవకుడి ‘సొంత’ చట్టాలు.
“పంట నమోదును రికార్డు చేయాలంటే కలెక్టర్, పోలీసుల పర్మిషన్ ఉండాలి.. లేకపోతే కుదరదు” అంటూ సదరు గ్రామ సేవకుడు విజయుడు కొత్త చట్టాలు మాట్లాడటం చూస్తుంటే, అతని అజ్ఞానానికి, లోపల జరుగుతున్న పెద్ద అక్రమాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేసే జర్నలిస్టులకే పర్మిషన్లు కావాలంటున్న ఈ మేధావి.. పొలాలు వదిలి బస్టాండ్‌లో క్రాప్ బుకింగ్ చేయడానికి ఏ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారో సమాధానం చెప్పాలి. ఇందులో ఏదో పెద్ద కుంభకోణమే దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖాకీల షాక్.. పోలీస్ స్టేషన్లో ‘ఎఫ్ఐఆర్’ నమోదు.
ఈ అరాచకంపై బాధితుడు మల్లికార్జున వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో న్యాయపోరాటానికి దిగారు. జర్నలిస్ట్‌పై దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని భావించిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. గ్రామ సేవకుడు విజయుడి దౌర్జన్యం, బూతుల పర్వం, బెదిరింపులు నిజమేనని తేలడంతో అతనిపై క్రిమినల్ కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేసి గట్టి షాక్ ఇచ్చారు. చట్టం ముందు ఏ రౌడీయిజం సాగదని పోలీసులు నిరూపించారు.
కలెక్టర్ యాక్షన్ ఏంటి..? తక్షణమే సస్పెండ్ చేయాల్సిందే!
ఈ దౌర్జన్యకాండపై బాధితుడు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్‌ను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. “ప్రభుత్వ రూల్స్‌కు వ్యతిరేకంగా పంట నమోదు చేస్తూ, పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానంతోనే నాపై దాడి చేశారు” అని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసినందున, ప్రభుత్వ నిబంధనలను నడిరోడ్డుపై ఖూనీ చేసి, విలేకరిపై దాడికి తెగబడిన సదరు గ్రామ సేవకుడు విజయుడిని తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని, శాఖాపరమైన విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాలు మరియు బాధితుడు జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేస్తున్నారు.



