ANDHRA PRADESHCRIME NEWS

యదేచ్ఛగా మట్టి అక్రమ రవాణా

దూరాన్ని బట్టి రేటు

యదేచ్ఛగా మట్టి అక్రమ రవాణా

దూరాన్ని బట్టి రేటు

పట్టించుకోని సంబంధిత అధికారులు

అమడగూరు ఏప్రిల్ 28 యువతరం న్యూస్:

మండలవ్యాప్తంగా మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి దోపిడీ కోసమే మేమున్నాం అన్నట్టుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందరికీ అభయం ఇచ్చేసి, పగలు రాత్రి తేడా లేకుండా అనుమతులతో పని లేకుండా, రోజుకో చెరువులో మట్టిని కొల్లగొడుతున్నారు.అధికారుల పర్యవేక్షణ లోపం, నేతల ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై నియంత్రణ లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.మహమ్మదాబాద్, జేకేపల్లి, అమడగూరు పంచాయతీలలోలోని చెరువులలో మట్టి అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.సమీప చెరువుల్లో మట్టిని ఎటువంటి రుసుము చెల్లించకుండా పంట పొలాలకు తీసుకెళ్లొచ్చు అనే నిబంధన మాటున అక్రమ వ్యాపారులు బరి తెగిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు యదేచ్చగా మట్టి తరలిపోతూనే ఉంది.జేసిబిల సాయంతో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లు చెరువు మట్టిని తవ్వేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని సమీప గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే అమడగూరు రెవెన్యూ అధికారులు మాత్రం రైతులు మట్టిని తోలుకోవాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు.ఒకవైపు సాధారణ రైతులకు కఠిన నిబంధనలు, మరోవైపు అక్రమంగా భారీగా మట్టి తరలింపుపై నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లా అధికారులు సూచనలు చేసినప్పటికీ, మండల రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అమడగూరు మండలం కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉండటం,గోరంట్ల ప్రాంతాల్లో మట్టికి డిమాండ్ ఉండటంతో ఇదే అదునుగా వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దూరాన్ని బట్టి రేటు

చెరువులలో మట్టి తరలించాలంటే రెవెన్యూ, నీటి పారుదల, గనుల శాఖల అధికారుల నుంచి అనుమతులు ఉండాలి అయితే మట్టి అక్రమ దారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ రూ.800 నుంచి రూ.1000 వరకు రేటు నిర్ణయించి,మట్టిని అక్రమంగా తరలించి, విక్రయిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏకంగా జేసీబీలు పెట్టి రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన మట్టిని తరలిస్తున్నారు.వాణిజ్య అవసరాలకు, భూస్వాముల తోటలు, పొలాలకు వేలాది ట్రాక్టర్ల మట్టి తరలిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం గృహావసరాలు అని చెప్పి, తప్పించుకుంటున్నారే గానీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇప్పటికే తవ్వేసిన మట్టికి సంబంధించి వ్యాపారులకు భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!