ఉల్లి రైతులు ఆందోళన చెందనవసరం లేదు
కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష

ఉల్లి రైతులు ఆందోళన చెందనవసరం లేదు
మార్కెట్ యార్డ్ కు వచ్చిన ఉల్లి రైతులకు రూ.1200 ల మద్దతు ధర లభిస్తుంది
ట్రేడర్లు రూ.12 ల కంటే తక్కువకు కొనుగోలు చేస్తే, రూ.12 లలో మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రైతుల అకౌంట్లకు జమ చేస్తుంది
ఫేక్ ప్రచారాలు, వదంతులను నమ్మకండి
జిల్లాలో యూరియా కొరత లేదు
రైతులు ఆందోళన చెందవద్దు
సమస్యల పరిష్కారం కోసమే “పల్లెకు పోదాం”
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 07 యువతరం న్యూస్:
ఉల్లి రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మార్కెట్ యార్డ్ కు వచ్చిన ఉల్లి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 ల మద్దతు ధర ఇస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, పల్లెకు పోదాం అంశాల పై జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం దాదాపు 31 వేల ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారన్నారు. దాదాపు 1.50 లక్షల టన్నుల ఉల్లి పంట దిగుబడి వస్తుందన్నారు. ఇప్పటికీ మార్క్ ఫెడ్,మార్కెట్ యార్డు ల ద్వారా 11 వేల 174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మద్దతు ధర టన్ను ఉల్లికి 1200 రూపాయలను ప్రకటించడం జరిగిందన్నారు. మూడవ తేదీ వరకు మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికీ 1226 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నిన్న ఒక్క రోజే 1600 టన్నుల ఉల్లి వచ్చిందన్నారు. 5 రోజుల్లో వచ్చినంత ఉల్లి కేవలం నిన్న ఒక రోజులోనే వచ్చిందన్నారు. అందులో 800 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడం జరిగిందని, మిగిలిన ఉల్లిని కూడా కొనుగోలు చేస్తామన్నారు. టెండర్ ప్రక్రియ యధావిధిగా జరుగుతుందని, టెండర్ లో 12 రూపాయలు కంటే తక్కువ ధర వస్తే, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి రైతులకు అన్యాయం జరగకుండా కిలోకు కనీస గిట్టుబాటు ధర 12 రూపాయలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్దన్నారు. రైతులు ఉల్లిని తీసుకొని వచ్చే సమయంలో ఉల్లిని ఆరబెట్టి తీసుకొని రావాలని కలెక్టర్ రైతులకు సూచించారు. అలా అని కోత రాకముందే పంటను కోసి తీసుకొని రావద్దని కలెక్టర్ సూచించారు. ఖరీఫ్ సీజన్ లో ఉల్లి పంట వేసిన ప్రతి రైతుకు క్వింటాల్ కి 1200 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. బయట చేస్తున్న ఫేక్ ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు.
జిల్లాలో ప్రస్తుతం యూరియా కొరత లేదని కలెక్టర్ తెలిపారు. ఈ అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి రెండు రోజులకోసారి కలెక్టర్ లతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 3 వేల 200 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. తొలుత కొన్ని మండలాలలో యూరియా సమస్యలు వచ్చాయని, సంబంధిత సమస్యలకు వెంటనే స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు అందరి రైతులకు యూరియా ను సరఫరా చేయడం జరిగిందని, వచ్చే 2 రోజుల్లో 2 వేల 600 టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. యూరియాను తగినంత మోతాదులో వినియోగించుకోవాలని, నానో యూరియాను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. గత ఏడాది 56 వేల టన్నుల యూరియాను రైతులకు అందచేయడం జరిగిందని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 64 వేల 746 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేయడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే అదనంగా 8 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇవ్వడం జరిగిందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఒకేసారి కాకుండా ఖరీఫ్ కి సంబంధించి యూరియా ఇప్పుడు తీసుకోవాలని, రబీ సీజన్ కి యూరియా మరలా వస్తుందని, అప్పుడు కూడా యూరియా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రైతులు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. యూరియా డైవర్షన్ కు సంబంధించి 5 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయడం జరిగిందని, 6A కి సంబంధించి 13 కేసులు నమోదు, 3 లెసైన్సు లు సస్పెండ్ చేయడం జరిగిందని, 4 షో కాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, అదే విధంగా కోటి 5 లక్షల విలువ కలిగిన 402 మెట్రిక్ టన్నుల యూరియా ను సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. అధికారులు 172 యూరియా ను విక్రయించే ఔట్లెట్ లను తనిఖీ చేశారని, అలాగే ప్రైవేట్ షాపుల్లో విఆర్ఓ లేదా విఏఏ ల ద్వారా విక్రయాలను పరిశీలించడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు .70 శాతం ప్రభుత్వం ద్వారా అనగా రైతు సేవా కేంద్రాలు, పిఎసిఎస్ ద్వారా 30 శాతం మాత్రమే ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు. యూరియా లభ్యత, ఉల్లి కొనుగోళ్లు, నానో యూరియా వాడకం పై వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పల్లెకు పోదాం అనే వినూత్న కార్యక్రమాన్ని నిన్నటి నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా 80 మంది ప్రత్యేక అధికారులను గుర్తించి నియమించి, వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు గ్రామం మొత్తం తిరిగి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అక్కడే పరిష్కరిస్తారన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటల్స్, హాస్టల్స్, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేయడం, అలాగే పారిశుధ్యం,రోడ్లు, నీటి సరఫరా, ఇళ్ళ నిర్మాణాలు తదితర అంశాలను కూడా పరిశీలించి, నిర్దేశించిన ప్రొఫార్మా లో పొందుపరచి ఆన్లైన్ పోర్టల్ లో అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. ఏ శాఖకు సంబంధించిన సమస్యను ఆ శాఖల లాగిన్ లకు పంపించు సంబంధిత హెచ్ ఓ డి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలను ఆర్థిక, ఆర్థికేతర సమస్యలుగా విభజించడం జరిగిందన్నారు. ఆర్థిక సమస్యలకు సంబంధించి ఏ పథకం కింద అర్హత ఉంటే ఆ పథకం కింద చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 6 నెలల్లో జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల తనిఖీలు పూర్తవుతాయన్నారు. కేవలం నిన్నటి రోజున దాదాపు 25 సమస్యలు పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మే వారిని, అదే విధంగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దులకు అక్రమంగా సరఫరా చేసే వారి పై 5 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అన్ని బార్డర్ చెక్పోస్టుల వద్ద పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో చెక్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో కలిసి జాయింట్ రైడ్ లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఉల్లిని ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేయడం జరుగుతోందని, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎస్పీ సూచించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని ఎస్పీ సూచించారు.