ANDHRA PRADESHDEVELOPOFFICIAL

హామీలుఇచ్చి మరిచిపోయిన గత వైసిపి ప్రభుత్వం

ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్

హామీలుఇచ్చి మరిచిపోయిన గత వైసిపి ప్రభుత్వం

పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసిన కూటమి ప్రభుత్వం

ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్

క్రిష్ణగిరి జులై 10 యువతరం న్యూస్:

పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని గురువారం క్రిష్ణగిరి మండలంలో ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, వంతెనలు, సంక్షేమ వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

క్రిష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ హాస్టల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం చిట్యాల గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.

తదుపరి కోయిలకొండ గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించి, సీసీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.

అనంతరం కోయిలకొండ–కంబాలపాడు గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణానికి గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చినా, ఐదేళ్ల పాలనలో ఆ హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

అదేవిధంగా తుగ్గలి మండలం బొందిమడుగుల వంతెనకు కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చి పూర్తి చేయలేకపోయిందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోయిలకొండ–కంబాలపాడు వంతెనతో పాటు బొందిమడుగుల వంతెనను కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం మాటలతో కాదు, చేతలతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

అనంతరం పెనుమాడ గ్రామంలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు.

తదుపరి కంబాలపాడు గ్రామంలోని ఎస్సీ హాస్టల్‌కు విచ్చేసిన ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ కి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి రాధిక ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిధులతో హాస్టల్‌లో చేపట్టిన సమగ్ర మరమ్మత్తు (రినోవేషన్) పనులను పూర్తిచేసి, విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అలాగే పూర్తిగా ఆధునీకరించిన ఎస్సీ హాస్టల్‌ను విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం కంబాలపాడు గ్రామంలో సీసీ రోడ్డును, శ్మశానవాటికకు వెళ్లే మార్గంలో నిర్మించిన నూతన వంతెనను* ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, “గత ప్రభుత్వం హామీలకే పరిమితమైతే, కూటమి ప్రభుత్వం పనులతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. పత్తికొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!