కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలలో అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలలో అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలి
గ్రామపంచాయతీ స్థాయిలో ఆర్థిక స్వావలంబన సాధించాలి
అమరావతి సర్కిల్ ఎస్బిఐ సిజిఎం రాజేష్ కుమార్ పాటిల్
నంద్యాల బ్యూరో ఆగస్టు 7 యువతరం న్యూస్:
కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలలో అర్హులందరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని అమరావతి సర్కిల్ ఎస్బిఐ సిజిఎం రాజేష్ కుమార్ పాటిల్ పేర్కొన్నారు.
గురువారం స్థానిక కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో… కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై గ్రామస్థాయి ఆర్థిక స్వావలంబనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జన్ ధన్ యోజన, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల పై ఎస్బిఐ ఖాతాదారులు, ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం అమరావతి సర్కిల్ ఎస్బిఐ సిజిఎం మాట్లాడుతూ… ఎస్బిఐ ఖాతాదారుల సేవా కేంద్రాలలో సామాజిక భద్రత పథకాలలో అర్హులైన వారందరూ పేర్లు నమోదు చేసుకోవచ్చునన్నారు. ఆర్బిఐ సూచనలు అనుసరించి… గ్రామపంచాయతీ స్థాయిలో ఆర్థిక సావలంబన సాధించడానికి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా బ్యాంకులో అందిస్తున్న సేవలపై విశదీకరించారు.
సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై అడిషనల్ ఎస్పీ జావలి సమావేశంలో అవగాహన కల్పించారు.
అనంతరం ప్రమాదంలో మృతి చెందిన రెండు కుటుంబాలకు సంబంధించి జీవిత బీమా రెండు లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
అంతకుముందుగా కార్యక్రమంలో కర్నూలు కళాజాత కళాకారులు సామాజిక భద్రతా పథకాలపై జానపద రీతిలో వినోదాత్మకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ డీజీఎం వి. హేమ, ఆర్ ఎం సూర్య ప్రతాప్, ఎల్డిఎం రవీంద్ర కుమార్, నాబార్డ్ డీడీఎం కార్తీక్, డిఆర్డిఏ పిడి వైవి శ్రీధర్ రెడ్డి, ఫైబర్ సీఐ వంశీ, తిమ్మరాజు పల్లి, చాపిరేవుల సర్పంచులు శేషారెడ్డి, డిఎన్ రాజు, యూనియన్, ఇండస్, యాక్సిస్ మరియు ఇతర బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.