జయహో నరసింహ

జయహో నరసింహ
మంగళగిరి ప్రతినిధి మార్చి 14 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన స్వామివార్ల దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. తొలుత అర్చక స్వాములు స్వామివార్ల ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్చరణల మధ్య తీసుకొని వచ్చి రథంపై అధిష్టింపజేశారు. అనంతరం స్వామివార్లను రంగురంగు పూలమాలలు, గజమాలలతో శోభాయమానంగా అలంకరించారు. రథంను కూడా నూతన వస్త్రాలు, పూలమాలలు, గజమాలలు, భక్తుల సమర్పించిన గుమ్మడికాయలతో అందంగా అలంకరించారు. రథోత్సవంలో స్వామివార్లకు దేవస్థానం ప్రధాన అర్చకులు దివ్య అనంత పద్మనాభచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. రథం ఎదుట శాలివాహనులు ఆనవాయితీగా కుంభం(అన్నం) వారబోశారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారు రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం దేవస్థానం వద్ద రథశాల నుండి ప్రారంభమై మెయిన్ బజార్, శాసనస్తంభం, సాదు సోడా సెంటర్, పూల మార్కెట్ సెంటర్ మీదుగా మిద్దె సెంటర్ కి చేరుకుంది. రధారూఢూడై పురవీధుల్లోకి ఉభయదేవేరులతో వేంచేస్తున్న శ్రీవారిని భక్తులు దర్శించుకుని టెంకాయలు కొట్టి, కర్పూర నిరాజనాలు సమర్పించారు. పురవీధుల్లోకి వేంచేసిన శ్రీవారి రథంపై మెయిన్ బజార్ లో భవనాలపై నుంచి భక్తులు పూల వర్షం కురిపించారు. జై నరసింహ, జై జై నరసింహ అంటూ భక్తులు, యువకుల జయ జయ నాదాలు, మేళతాళాలు, కనక తప్పెట్లు, తీన్మార్, బాణాసంచా పేలుళ్లు, విచిత్ర వేషధారణల మధ్య రథోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. ఉత్సవానికి మాడభూషి వేదాంతచార్యులు కైంకర్య పరులుగా వ్యవహరించారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా పోలీసులు ప్రటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వాహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.