హనుమంత వాహనంపై నరసింహుడు

హనుమంత వాహనంపై నరసింహుడు
మంగళగిరి ప్రతినిధి మార్చి 7 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనంపై అధిష్టింప చేసి రంగు రంగు పూలమాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమనంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంతపద్మనాభచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. భక్తి తత్వాన్ని ప్రపంచానికి అందించిన భక్తాగ్రేశ్వరుడు హనుమంతుడని, అందుకే స్వామివారు హనుమంతుని వాహనంగా ఎంచుకున్నారన్నారు. హనుమంతుని భుజస్కంధములపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు అధిరోహించిన ఉత్సవాన్ని భక్తులు తిలకించిన, సేవించిన వారికి సద్బుద్ధిని, అభయాన్ని ప్రసాదిస్తారన్నారు. గ్రామోత్సవం తోలుత దేవస్థానం నాలుగు మాడవీధులలో నిర్వహించి, అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్ కు సాగింది. విచిత్ర వేషధారణలు, బాణాసంచా పేలుళ్లు, మేళతాళాలు, కనక తప్పట్లు మధ్య ఉత్సవం నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యల హాజరై స్వామివార్లను దర్శించుకుని, టెంకాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి పేదపాలెం కు చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వాహణాధికారి అన్నపురెడ్డి రామకోటి రెడ్డి పర్యవేక్షించారు.