ANDHRA PRADESHBREAKING NEWSDEVOTIONALWORLD

ఈవీఎం అయినా … బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే

ఈవీఎం అయినా … బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే

9 నెలల్లో అధికారం, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించడం టీడీపీకే సాధ్యం

ఈ విజయం ఒక చరిత్ర, ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు ధన్యవాదాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే దమ్ము, ధైర్యం కూడా వైసీపీకి లేవు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి లోకేష్

అమరావతి ప్రతినిధి మార్చి 4 యువతరం న్యూస్:

ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యం. 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత విశ్వ విఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది. 9 నెలల్లో రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమమేంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రియతమ నాయకుడు మన చంద్రన్న గారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి ఐదుకు ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు గాను ఐదు ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు.. భారీ మెజార్టీతో గెలిస్తేనే అదొక గెలుపని ఆనాడు చెప్పడం జరిగింది. కృష్ణా – గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82వేల ఓట్ల మెజార్టీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు గెలిచారు. తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజారిటీతో రాజశేఖర్ గారు విజయం సాధించారు. కౌన్సిల్ లో పులుల్లా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. మరో ఇద్దరు నాయకులు కౌన్సిల్ కు రాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు, గెలుపు కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే దమ్ము, ధైర్యం కూడా వైసీపీకి లేవు

ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదు. ఆయనకు కొత్త పేరు పెట్టా. ఆయన ఒక రోజు ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఒక్క రోజు మాత్రమే వస్తారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా అసెంబ్లీకి ఒక రోజు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడిగి బెంగుళూరు పారిపోతారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెడితే డిపాజిట్ రాదని, అందుకే అభ్యర్థిని నిలిపే దమ్ము, ధైర్యం లేక వెనక్కి వెళ్లారు. 2023 లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తున్నాయా? అప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గేమ్ ఛేంజర్ గా మారాయి. ఆ ఎన్నికలతో రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలల ముందే మనం అభ్యర్థులను ప్రకటించుకున్నాం. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా రామ్ గోపాల్ రెడ్డి గారు, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా శ్రీకాంత్ కంచర్ల గారు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా వేపాడ చిరంజీవి రావు గారు… ఆ రోజు ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైసీపీకి దిమ్మతిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. కట్ చేస్తే 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఓ వైపు మోడీ మేనియా, మరోవైపు బాబు గారి బ్రాండ్, ఇంకోవైపు నాకు అన్న సమానులైన పవనన్న పవర్ దెబ్బకు వైకాపాకు దిమ్మతిరిగి దుకాణం బంద్ అయింది.

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీ

అసలు దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. వైసీపీ ఐదేళ్లలో చేయని సంక్షేమం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. చాలీచాలని రూ.200 పెన్షన్ ను ఐదురెట్లు చేసి వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు గారిది. వెయ్యిని రూ. 2000 చేసింది కూడా చంద్రబాబు గారే. ఇప్పుడు రూ.3000 పెన్షన్ ను రూ.4000 చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు ది. దివ్యాంగుల పెన్షన్ రూ.3000 నుండి రూ.6000 చేశారు. పూర్తిగా మంచానికి పరిమితం అయిన వారికి ప్రతినెల రూ.15,000 పెన్షన్ ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. 198 అన్నా క్యాంటిన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పధకం కింద ఇప్పటికే కోటి సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. వచ్చే మే లో ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇవ్వబోతున్నాం. మే లో అన్నదాత సుఖీభవ రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం.

ఈ గెలుపు యువతది

20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అని దేశంలో ఏ పార్టీ చేయని విధంగా మ్యానిఫెస్టోలో పెట్టిన దమ్మున్న పార్టీ టీడీపీ. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. మాపై బాధ్యత పెంచారు. పద్దతి ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తాం, జాబ్ కేలండర్ కూడా విడుదల చేస్తాం. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులు కల్పిస్తూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు, 4,28,705 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్, ఎన్ హెచ్పీసీ, ఏపీ జెన్ కో, బీసీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, ఎస్ఏఈఎల్ సోలార్, టాటా పవర్.. ఇలా అనేక కంపెనీలు వస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న ఎన్నో చెత్త నిర్ణయాల వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు వాటిని రద్దు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. చెత్త పన్ను, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం

కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతి పనులు ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అందించింది. పోలవరం పనులు ప్రారంభం అయ్యాయి. నిర్వాసితులకు వెయ్యి కోట్లు మన ప్రభుత్వం అందజేసింది. కేంద్రం రూ.12,157 వేల కోట్ల ఆర్థిక సాయం అందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం. కేంద్రం రూ.13 వేల కోట్ల సాయం అందించింది. విశాఖ రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. రోడ్లపై గుంతలు కూడా పూడ్చిన ఘనత మన ప్రభుత్వానిది.

ఈ నెలలోనే అన్ని పదవుల భర్తీ

దేశంలో ఏ పార్టీకి లేని బలం మనకు ఉంది. కార్యకర్తలే టీడీపీకి బలం, బలగం. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. ఎవరైనా చెడు చేస్తే చీల్చి చెండాడతారు. ఒక పద్ధతి ప్రకారం నామినేటెడ్ పదవులు అన్ని భర్తీ చేస్తున్నాం. గౌరవ జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ నెలలోనే అన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలుకొట్టాం. కార్యకర్తల ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచాం. నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం దాదాపు రూ.130 కోట్లు ఖర్చుచేశాం.

చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరినీ వదిలిపెట్టం:

ఈ రోజు నేను ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టం. ఆ ప్రక్రియ ప్రారంభం అయింది. అంతేగాని ఎవరినో వదిలిపెడతామనే అనుమానాలు వద్దు. ఈ విజయానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అహర్నిశలు నాతో కోఆర్డినేట్ చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేసిన జనసైనికులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!