నేటి నుండి పి4 సర్వే ప్రక్రియ ప్రారంభం

నేటి నుండి పి4 సర్వే ప్రక్రియ ప్రారంభం
పి4 సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి
మార్చి 2వ తేదీలోగా సర్వే పూర్తి కావాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల కలెక్టరేట్ ఫిబ్రవరి 20 యువతరం న్యూస్:
సున్నా పేదరికమే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడిఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పి4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిపిఓ వేణుగోపాల్, డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా పేదరిక నిర్మూలనకు పి-4 (ప్రభుత్వ- ప్రైవేటు- ప్రజల భాగస్వామ్య) విధాన సర్వే ప్రక్రియను సచివాలయ సిబ్బందిచే నేటి నుండి పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జీరో పావర్టీ, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపు, రైతు సాధికారత, త్రాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు తదితర పది సూత్రాల అనుసంధానంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి సచివాలయంలో పది సూత్రాల పట్టికను అతికించాలన్నారు. సున్నా పేదరికమే లక్ష్యంగా పి4 సర్వే ద్వారా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న అతి నిరుపేదల జాబితాలు తయారు చేయాలన్నారు. చేపట్టిన సర్వే మార్చి 2వ తేదీలోగా పూర్తి చేసి నివేదికలు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దారిద్యరేఖకు దిగువనన్న అట్టడుగు స్థాయి ఉన్న 20 శాతం కుటుంబాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సూచించిన ప్రొఫార్మాలో పూర్తి వివరాలను సేకరించాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం కుటుంబాలను గుర్తించి వారిని అభివవృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. పరిపూర్ణ డేటా సేకరిస్తే ప్రభుత్వం సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా తాండాలు, చెంచు కాలనీలు, స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న అట్టడుగు స్థాయి కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.