ప్రజాభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఏపీ రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్

ప్రజాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల కలెక్టరేట్ సెప్టెంబర్ 25 యువతరం న్యూస్:
ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం నంద్యాల నియోజకవర్గంలోని అయ్యలూరు మెట్ట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం – ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు అయిన సందర్భంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు స్వర్ణాంధ్ర 2047 పేరుతో పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. అమరావతిలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో వున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వరద బాధితులకు అండగా నిలబడి ఒక తండ్రిలా ప్రజల్ని కాపాడారని గుర్తు చేశారు. గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం అండగా ఉండి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నంతవరకు రాష్ట్రంలో ఆదర్శ పాలన కొనసాగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్రం ఏమాత్రం తీసిపోకోకుండా అభివృద్ధి దిశలో పయనించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విజయవాడలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వచ్చి సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులలో చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. స్వర్ణాంధ్ర@2047 దార్శనిక పత్ర రూపకల్పనలో భాగంగా క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని ప్రజలందరూ సహకరించి అభివృద్ధి ప్రణాళికలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా స్వర్ణాంధ్ర కరపత్రాలు, స్టిక్కర్లను ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది ద్వారా చేరవేస్తున్నామన్నారు. అంతకుముందు మంత్రి, జిల్లా కలెక్టర్ కు గ్రామస్తులు డప్పు, వాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం అయ్యలూరు మెట్ట ప్రాంత నివాసి కొమ్ము రమణారెడ్డి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 15,000 రూపాయల నగదు మొత్తాన్ని మంత్రికి అందజేశారు. పిదప రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ఇది మంచి ప్రభుత్వ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, తహశీల్దార్ ప్రియదర్శిని, ఎంపీడీవో సుగుణశ్రీ, అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.